Visakhapatnam : ఏపీలో( Andhra Pradesh) మరో భారీ ఈవెంట్ జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు వేదిక కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి యోగాలో భారత్ దిక్సూచిగా నిలవనుంది. అయితే ఈసారి ప్రధాని మోదీ పాల్గొనే యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుండడం విశేషం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం భారీగా ప్లాన్ చేస్తోంది. సాధారణ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డ్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి యోగా దినోత్సవం. ఇదే విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగే యోగా దినోత్సవం గురించి వ్యాఖ్యలు చేశారు.
* ముఖ్యఅతిథిగా ప్రధాని..
జూన్ 21న యోగా దినోత్సవాన్ని( yoga day) పురస్కరించుకుని విశాఖలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వచ్చిన సంగతి తెలిసిందే. అదే వేదికపై యోగా దినోత్సవానికి సైతం వస్తానని ప్రధాని ప్రకటించారు. ఏపీ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 5 లక్షల మందితో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆరోగ్యకర జీవనానికి యోగ చాలా కీలకమని.. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందని మహానాడు వేదికగా చంద్రబాబు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచానికి యోగాను పరిచయం చేయడంపై కొనియాడారు. రాబోయే మహానాడుకు అందరూ యోగా చేయాలని.. యోగా నేర్చుకుని జూన్ 21న విశాఖ రావాలని సూచించారు చంద్రబాబు.
Also Read : సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!
* ఆర్కే బీచ్ టు భీమిలి బీచ్..
కాగా విశాఖలో ( Visakhapatnam)యోగా వేడుకలకు సంబంధించి అప్పుడే ఏర్పాట్లు ప్రారంభించింది యంత్రాంగం. ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు యోగ ప్రదర్శనలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధన లక్ష్యంగా… మొత్తం మార్గంలో 127 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఒక్కో కంపార్ట్మెంటులో 1000 మంది చొప్పున పాల్గొంటారని. ప్రతి 200*14 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఉంటుందని.. ప్రతి కంపార్ట్మెంట్ కు ఒక ఇంచార్జ్, వైద్య సిబ్బంది, పదిమంది వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు భారీ ఎల్ఈడి స్క్రీన్లు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టం వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు.
* చురుగ్గా ఏర్పాట్లు..
మరోవైపు ప్రధాని( Prime Minister) హాజరయ్యే కార్యక్రమానికి సంబంధించి పీ ఎం ఓ నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు సమాచారం కూడా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరోవైపు భద్రతా సిబ్బంది సైతం ఇప్పటికే నగరాన్ని పరిశీలించినట్లు సమాచారం. విశాఖ బీచ్ రోడ్డులో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. యోగా దినోత్సవం నాడు ఐదు లక్షల మంది రానుండడంతో.. భద్రతకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.