https://oktelugu.com/

Visakhapatnam: విశాఖలో వైసీపీకి షాక్.. మూకుమ్మడిగా కార్పొరేటర్లు జంప్.. కోలుకోవడం కష్టమే!

Visakhapatnam: జగన్ ఎక్కడి నుంచి అయితే పాలన కొనసాగించాలనుకున్నారో అక్కడే ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నగరంలో దారుణ పరాజయం ఎదురైంది. అది మరవక ముందే జీవీఎంసీ పీఠం చేజారే పరిస్థితి కనిపిస్తోంది. కేవలం వివాదాస్పద వైసిపి కార్పొరేటర్లు తప్ప.. మిగతా వారంతా టిడిపి, జనసేనలో చేరుతున్నారు. దీంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం టిడిపి వశమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 22, 2024 10:46 am
    YCP Corporators To Join in TDP And Janasena Party

    YCP Corporators To Join in TDP And Janasena Party

    Follow us on

    Visakhapatnam: విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనలో చేరారు. మరికొందరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో 98 మంది కార్పొరేటర్లకు గాను 97 మంది ఉన్నారు. వైసిపి 56 స్థానాలను గెలుచుకోవడంతో జీవీఎంసీ పీఠం ఆ పార్టీకి దక్కింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో.. ఓటమి అభ్యర్థులు 50 నుంచి 97 వేల వరకు మెజారిటీలతో గెలిచారు. దాదాపు 70 శాతం ఓట్లతో కూటమి పార్టీలు ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావిస్తున్న కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు.

    * 44 కి పడిపోయిన బలం
    ప్రస్తుతం జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. తాజాగా 12 మంది కార్పొరేటర్లు టిడిపి, జనసేనలో చేరడంతో వైసిపి బలం 44 కి పడిపోయింది. అదే సమయంలో టిడిపి బలం 40 కి,జనసేన బలం 10కి పెరిగింది.మేయర్ పదవి దక్కించుకోవాలంటే 49 మంది కార్పొరేటర్లు ఉండాలి. టిడిపి కూటమికి ఇప్పుడు 51 మంది ఉన్నారు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరో ఆరుగురు వైసిపి కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక పరిస్థితుల దృష్ట్యా 8 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి చేరుతామని ప్రయత్నాలు చేసినా.. అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గతంలో వారి వైఖరితో టిడిపి, జనసేన శ్రేణులు ఇబ్బంది పడినందువల్ల.. వారు చేరితే పార్టీ క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందుకే వారి చేరికను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

    * దాదాపు ఖాళీ..
    విశాఖ నగరంలో దాదాపు వైసీపీ ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున కార్పోరేటర్లు టిడిపి తో పాటు జనసేనలో చేరారు. దీంతో జీవీఎంసీలో మేయర్ స్థానాన్ని వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది. మేయర్ ను రాజీనామా చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల వైసిపి ప్రజాప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. అందుకే అధికార పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీలున్నంతవరకు అవిశ్వాసాల ద్వారా వైసిపి నేతలను దించి.. ఆ స్థానాల్లో టిడిపి నేతలకు పదవులు కేటాయించే అవకాశం ఉంది.

    * స్వాగతించని ప్రజలు..
    ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లా నుంచి వైసీపీ నుంచి ఎక్కువగా చేరికలు పెరిగే అవకాశం ఉంది. విశాఖను జగన్ పాలన రాజధానిగా ప్రకటించారు. అయినా సరే ప్రజలు పెద్దగా స్వాగతించలేదు. రాజధాని పేరుతో వైసిపి నేతలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అందుకే విశాఖ నగర ప్రజలు గుణపాఠం నేర్పారు. ఏకంగా 70 శాతం ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. అందుకే వైసీపీ శ్రేణులు తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఉన్నాయి. వీలైనంతవరకు వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చాయి. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ వీలుకాకపోతే జనసేన.. ఆ రెండు పార్టీలు కాకుంటే బిజెపి అన్న రీతిలో.. వైసీపీ నేతలు ఉన్నారు.

    * ఆవిర్భావం నుంచి అంతే..
    వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరంపై జగన్ కు పట్టు దొరకలేదు. 2014లో దాదాపు నగరం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2019 ఎన్నికల్లో సైతం జిల్లాలో అన్ని స్థానాలను టిడిపి కోల్పోయిన.. నగరంలో కీలకమైన తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలను మాత్రం టిడిపి గెలుచుకుంది. ఎన్నికల్లో టిడిపి కూటమి స్వీప్ చేసింది. ఎక్కడా 40,000 ఓట్ల మెజారిటీ తగ్గలేదు. దీంతో వైసీపీకి ఇక భవిష్యత్తు లేదని పార్టీ శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చాయి. అందుకే కూటమిలోని ఆ మూడు పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మొత్తానికైతే వైసీపీ విశాఖ నగరంలో పూర్తిగా ఖాళీ అయినట్టే.