Vizag Rave Parties: విశాఖలో రే*వ్ పార్టీ సంస్కృతి విస్తరిస్తోంది. రెండు రోజుల కిందట నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్ లో.. రే*వ్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. ఒక బుల్లితెర నటి పుట్టినరోజు వేడుకల పేరుతో వందమంది వరకు రే*వ్ పార్టీలో పాల్గొన్నట్లు విశాఖ సర్కిల్స్ లో ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఓ పార్టీకి చెందిన నేతలు మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు.. కత్తిపోట్లు సైతం చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసులు రాజీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం నగరం విస్తరిస్తోంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ సంస్కృతి నడుస్తోంది. ఈ క్రమంలోనే రే*వ్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. మహిళల కోసం కొందరు నాయకులు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నట్లు కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రచురించాయి.
* నగర శివారు ప్రాంతాల్లో..
ప్రధానంగా భీమిలి, శోంట్యం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫామ్హౌస్ ల తో పాటు రిసార్ట్స్ ఉన్నాయి. నగరానికి చెందిన ప్రముఖులతో పాటు యువకులు ఎక్కువగా ఆ ఫామ్ హౌస్లలో పాటు రిసార్ట్లో రే*వ్ పార్టీలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు విశాఖ నగరంలో ఆ సంస్కృతి లేదు కానీ.. ఇటీవల పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం పర్యాటక నగరం కావడంతో పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పక్కనే ఉన్న ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ నుంచి సైతం పర్యాటకులు వస్తున్నారు. పర్యాటకుల ముసుగులోనే ఈ పార్టీ కల్చర్ ఎక్కువగా విస్తరిస్తోంది. రిసార్ట్లతోపాటు ఫామ్ హౌస్లలో రే*వ్ పార్టీలు జరుగుతున్నాయి.
* హైదరాబాదు నుంచి రాక..
మరోవైపు సినీ పరిశ్రమతో పాటు బుల్లితెరకు చెందిన నటులు ఎక్కువగా విశాఖ వస్తున్నారు. హైదరాబాద్లో పోలీసుల నిఘా ఎక్కువ కావడం.. బయటకు లీకులు తెలిసిపోతుండడంతో.. విశాఖ అయితే సేఫ్ జోన్ అని ఎక్కువ మంది భావిస్తున్నారు. పైగా హైదరాబాద్ తో పోల్చుకుంటే విశాఖలో ఖర్చు తక్కువ. విదేశీ మద్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే విదేశాల నుంచి ఎక్కువగా షిప్ లు వస్తుంటాయి.. అందుకే విదేశీ మద్యం ఇక్కడ అక్రమంగా రవాణా చేసుకొని అధిక ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నగర శివారులలో ఇప్పుడు ఈ రే*వ్ పార్టీలు అనేవి కామన్ గా మారినట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తుండడంతో.. ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా పెరగనుంది. ఇంకోవైపు పర్యాటక ప్రాజెక్టులు సైతం భారీగా పెరగనున్నాయి. ఈ క్రమంలో రే*వ్ పార్టీలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
* కట్టడి చేయకుంటే కష్టం..
ఆదిలోనే ఈ రే*వ్ పార్టీలను కట్టడి చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడుతున్న దాని మూలాలు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి. విశాఖ మన్యప్రాంతంలో.. ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారు. భారీ స్థాయిలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ క్రమంలో పార్టీ కల్చర్ పెరిగితే కచ్చితంగా మత్తుపదార్థాల వినియోగం కూడా పెరుగుతుంది. అందుకే ఆదిలోనే కట్టడి చేయాల్సిన అవసరం పోలీస్ శాఖపై ఉంది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడితే బాగుంటుంది.