Visakha steel plant : గత కొద్దిరోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant ) ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందని అంతా భావిస్తున్నారు. అయితే కార్మికులతో పాటు ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతోంది. ఇలా ప్యాకేజీ ఇచ్చే కంటే విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ ప్రైవేటీకరణ ఆగలేదన్నది కార్మికుల అభిప్రాయం. ఈ విషయంలో కేంద్రం కూడా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. పాడి త్రినాథ్ అనే కార్మిక సంఘం నేత కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాశారు. ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత కోరుతూ ఆయన ఈ లేఖ రాశారు. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చేసింది. దీంతో కార్మిక సంఘాలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యమించడానికి సిద్ధపడుతున్నాయి.
Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి పీల్చుకో.. ఎట్టకేలకు కదిలిన కేంద్రం.. ఇక మంచి రోజులే*
* వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర పైకి వచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయిందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే విశాఖ ఉక్కు కు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని విస్పష్ట ప్రకటన చేయలేదు కేంద్రం. దీంతో కార్మిక సంఘాల్లో ఒక రకమైన అనుమానం ఉంది. ఫాక్ట్ చెక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కార్మిక సంఘం నేత లేఖ రాశారు. అయితే దానికి రిప్లై ఇచ్చే క్రమంలో ఉక్కు పరిరక్షణకు తమ వంతు కృషి ఉంటుందని చెప్పిందే కానీ.. ఇక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. పైగా విశాఖ ఉక్కును కేంద్రం విక్రయిస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
* రంగంలోకి ఉక్కు శాఖ మంత్రి
గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్న సమయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి( central minister Kumaraswamy) రంగంలోకి దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించబోమని తేల్చి చెప్పారు. అటు తరువాత పదివేల కోట్లకు పైగా నిధులను కూడా కేటాయించారు. దీంతో ఇక ప్రైవేటీకరణ అనేది ముందుకు సాగదని అంతా భావించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై పూర్తి స్పష్టతనివ్వడం లేదు కేంద్రం. నిలుపుదల చేస్తామని నేరుగా చెప్పడం లేదు. ప్రైవేటీకరణ ఆగదని సంకేతాలు ఇచ్చేలా చెప్పడంతో మరోసారి అనుమానాలు ప్రారంభమయ్యాయి.
Also Read: విశాఖ స్టీల్ కు భారీ ప్యాకేజీ.. అసలు లెక్క అదేనా!