Viral Video : ఇప్పుడు తెలుగు మీడియా రెండు రకాలు.. ఒకటి అధికార పార్టీకి డప్పు కొట్టేది.. రెండు ప్రతిపక్ష పార్టీలకు డప్పు కొట్టేది. వాటిని వాయించే తీరు ఆధారంగానే రాజకీయ పార్టీలకు అధికారం లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో రెండు పర్యాయాలు భారత రాష్ట్ర సమితికి అధికారం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు సెక్షన్ల మినహా మిగతా మీడియా మొత్తం ఆ పార్టీకి సాగిలపడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఒకటి, రెండు సెక్షన్లు మినహాయిస్తే మిగతా మీడియా మొత్తం కాంగ్రెస్ పార్టీకి డప్పు కొడుతున్నది. సింపుల్ గా మన పరిభాషలో చెప్పాలంటే దీనిని ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు. పైగా మీడియా సంస్థలు నిర్వహించేవారు ఒకప్పుడు ప్యాషన్ తో ఉండేవారు. ఇప్పుడు వివిధ వ్యాపారాలను అడ్డుపెట్టుకోవడానికి మీడియా సంస్థలను నిర్వహిస్తున్నారు.. ఇక ఈ మీడియా సంస్థలను నిర్వహించే వారి దగ్గరికి ముఖ్యమంత్రులు వెళ్లడం.. వారి ఆశీస్సులు తీసుకోవడం ఇటీవల కాలంలో ఒక పరిపాటిగా.. ఒక రివాజుగా మారిపోయింది. న్యూట్రల్ గా ఉండే మీడియా వ్యవస్థల దగ్గరికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి వెళ్లినప్పుడు.. ఆ మీడియా హౌసులు ఎలాంటి వార్తలను ప్రసారం చేస్తాయి..
.. ఎలాంటి వార్తలను ప్రచురిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..
Also Read : అమరావతి మహిళలపై కామెంట్స్.. సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్!
ముందుగానే మనం చెప్పుకున్నట్టు.. మీడియా రెండు రకాలు అనుకున్నాం కదా.. అందులో ఒకటి ప్రభుత్వానికి డప్పు కొట్టేది అని చెప్పుకున్నాం కదా.. ఇక ప్రతిపక్ష పార్టీలకు డబ్బు కొట్టే ఛానల్, పేపర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు ఈ చానల్స్ కు, పేపర్లకు ప్రజా సమస్యలు గుర్తుకురావు. అప్పుడు కేవలం అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది. సంక్షేమం మాత్రమే దర్శనమిస్తుంది. పైగా తమకు అనుకూలమైన వ్యక్తి పరిపాలనలో ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ మీడియా హౌస్లలో పనిచేసే పాత్రికేయులలో విపరీతమైన సానుకూల దృక్పథం కనిపిస్తుంది. ఒక రకంగా వారికి అద్భుతమైన, ఆనందమయమైన లోకం దర్శనమిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ పార్టీ ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లిపోయిన తర్వాత ఆ మీడియా హౌస్ లకు.. అందులో పని చేసే వారికి.. ప్రజా సమస్యలు గుర్తుకు వస్తాయి. ప్రాంత సమస్యలు యాదికి వస్తాయి. అన్నింటికీ మించి ప్రతీది వారికి ఇబ్బందిగానే.. వ్యతిరేక కోణంలోనే కనిపిస్తుంది..
ఇలాంటి సందర్భాలలో వారి నోటి వెంట ఆగ్రహ పూరితమైన మాటలు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో.. మరీ ముఖ్యంగా చర్చా వేదికలు నిర్వహించినప్పుడు వారి నోటి వెంట రాయడానికి వీలు లేని.. చెప్పడానికి సాధ్యం కాని మాటలు వస్తుంటాయి. వాటిని కేవలం కోపం అనే కోణంలో మాత్రమే చూడాలి. ఆ మాటలను ఆయా మీడియా హౌస్ లకు ఆపాదించకూడదు. సంబంధం ఉందని భావించకూడదు. ఆ మీడియా హౌస్ లలో పనిచేసేవారు లేదా చర్చావేదికలలో పాల్గొనేవారు మాట్లాడిన మాటలను వ్యతిరేక కోణంలో అస్సలు చూడకూడదు. ఒకవేళ ఆ మాటలను విన్నా పట్టించుకోకూడదు. జస్ట్ చూసి ఊరుకోవాలి. విని అలా ఉండిపోవాలి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అంటున్నది కూడా అలానే ఉంది.. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసి దానికంటే ముందు సాక్షి ఛానల్ లో ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి.. ఇప్పటికే ఆ విషయం గురించి తాను క్షమాపణ చెప్పానని.. ఆ విషయాన్ని మొత్తం వెల్లడించానని.. ఇకపై జరిగేది జరుగుతుందని ఆయన తెగేసి చెప్పారు. ఈ మాట అంటున్నది కూడా మేం కాదు.. సాక్షాత్తు ఆయన పనిచేస్తున్న ఛానల్ లోనే ప్రసారమయ్యాయి ఈ వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఆయనను అత్యంత నాటకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుళ్లూరు ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. సహజంగానే ఈ పరిణామాన్ని కూటమి నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని అంటుంటే.. పాత్రికేయులపై కూడా కేసులు పెడతారా అంటూ వైసీపీ నేతలు అంటున్నారు.. దీనినే నాణానికి అటూ ఇటూ అని చదువుకోవాలేమో..
View this post on Instagram