Viral MLA Apology Video: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో( social media) జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఏకంగా ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈనెల 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. దీంతో విజయోత్సవాలు నిర్వహించారు. మీతో మీ ఎమ్మెల్యే పార్థసారథి పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదోని మండలం దానాపురంలోని గుడి కట్టపై సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథి తో పాటు టిడిపి నాయకురాలు కృష్ణమ్మ హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ ఎవరు అంటూ ఎమ్మెల్యే పిలిచారు. ఆయన రాకపోవడంతో.. సర్పంచ్ ఏమైనా క్రిస్టియనా అంటూ ఆరా తీశారు. పక్కనే ఉన్న క్రిష్టమ్మ ఆయన చెవిలో ఎస్సీ అని చెప్పారు. ఇంతలో సర్పంచ్ చంద్రశేఖర్ అక్కడకు వచ్చారు. అయితే స్టేజ్ దగ్గరే నిలబడాలని ఎమ్మెల్యే పార్థసారథి ఆ సర్పంచ్ కు సూచించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దళిత ఎమ్మెల్యే కావడంతోనే తాము నిల్చున్న చోట నిలబెట్టారని.. కాళ్ల వద్ద వేచి చూసేలా చేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై కుల వివక్ష పోరాట సమితి తో పాటు కుల సంఘాల ప్రతినిధులు రియాక్ట్ అయ్యారు.
ఎమ్మెల్యే స్పందన
గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుండడంతో ఎమ్మెల్యే పార్థసారథి( parthasarathi ) స్పందించారు. బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు.’ సర్పంచి విషయంలో జరిగిన దానికి బాధపడిన ప్రతి ఒక్కరికి, దళిత సంఘాల ప్రతినిధులకు క్షమాపణ చెబుతున్నాను. నేను బీసీ వర్గం నుంచి వచ్చాను. దళితుల పట్ల వివక్ష చూపుతానని ఎలా అనుకుంటారు? ఎవరో కావాలని వీడియో వైరల్ చేస్తున్నారు. ఆదోని పురపాలక కార్యాలయంలో దళితుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న ఏకైక ఎమ్మెల్యేను నేనే’ అని అన్నారు పార్థసారథి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే క్షమాపణ కోరిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Maganti Gopinath Passes Away: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
వైసిపి నుంచి గెలిచి బిజెపిలో..
మరోవైపు ఈ ఘటనపై సర్పంచ్ చంద్రశేఖర్( Chandrashekhar) స్పందించారు. ఎమ్మెల్యే పిలవడంతోనే తాను స్టేజి ఎక్కాలనే ఉద్దేశంతోనే వెళ్లినట్లు చెప్పారు. కానీ ఎమ్మెల్యే పక్కన ఉన్న టిడిపి నేత ఎస్సి అని చెప్పడంతో కిందనే ఆపేసినట్లు తెలిపారు. అసలు అక్కడ కులం గురించి ఎందుకు అడిగారో వాళ్ళకే తెలియాలని చెప్పారు. అసలు అలా ఎందుకు వ్యవహరించారో తెలియదన్నారు. కాగా దళిత సర్పంచ్ చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిజెపిలో చేరారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడంతో దళిత సంఘాలు శాంతిస్తాయో? లేదో? చూడాలి.
