Vijaysai Reddy: వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అంతర్జాతీయ వేదికపై మెరిశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడం విశేషం. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అటువంటి ఎన్డీఏ విపక్ష వైసిపి ఎంపీకి ప్రాధాన్యం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇది కొంచెం టిడిపికి ఇరకాటంలో పెట్టే అంశమే. అదే సమయంలో వైసీపీ పట్ల ఇప్పటికీ కేంద్ర పెద్దలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు ఈ ఘటన తెలియజేస్తోంది. వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ విజయసాయిరెడ్డి. జగన్ కంటే ఢిల్లీ పెద్దలతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు కొనసాగించేది విజయసాయిరెడ్డి. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కు గుడ్ బై చెప్పడానికి,అదే కేంద్ర పెద్దలు వైసీపీని చేరదీయడానికి వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. అప్పట్లో వైసీపీని కేంద్ర పెద్దల దగ్గరకు చేర్చేందుకు విజయసాయిరెడ్డి చాలా వరకు తగ్గి ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే గత ఐదేళ్లుగా వైసీపీకి కేంద్ర పెద్దలు రాజకీయంగా సహకరించడానికి కూడా కారణం ఆయనే. అటువంటి విజయసాయిరెడ్డిని ఐక్యరాజ్యసమితి 79వ సదస్సుకు హాజరయ్యే భారత ప్రతినిధుల బృందంలో ఛాన్స్ ఇవ్వడం విశేషం. అయితే దీని వెనుకాల రకరకాల చర్చ నడుస్తోంది.
* ఇటువంటి సమయంలో అవకాశం
ప్రస్తుతం వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.కేంద్రంలో భిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అందులో బిజెపి భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ పరిణామాల నడుమ వైసీపీకి ఎటువంటి అవకాశాలు రాకూడదు.కానీ ఐక్యరాజ్యసమితికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ప్రతినిధి బృందంలో వైసీపీకి చోటు కల్పించింది కేంద్రం.అంటే ఇప్పటికీ వైసీపీ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందన్నమాట. దీనిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ.ఇప్పటికీ వైసీపీతో బిజెపి అనుబంధం కొనసాగడాన్ని తప్పుపడుతోంది.
* అదే ఆనవాయితీ
అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడలేదని చెబుతోంది. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో విపక్ష నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయిని ఐక్యరాజ్యసమితి సదస్సుకు భారత్ తరుపున పంపించారు. అటు తరువాత చాలామంది ఎంపీలు ఐక్యరాజ్యసమితికి వెళ్లారు. కింజరాపు ఎర్రం నాయుడు, ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు సైతం ఐక్యరాజ్యసమితి సదస్సులో మెరిశారు. విపక్ష నేతలను గుర్తించి ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని పంపించినట్లు కేంద్ర పెద్దలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆ అనుమానం వెంటాడుతూనే ఉంది.