Vijayawada Dasara Celebrations: ఏపీ ప్రభుత్వం( AP government) మరో ఘనతను సొంతం చేసుకుంది. విజయవాడ దసరా ఉత్సవాలు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసుకున్నాయి. మైసూరు దసరా ఉత్సవాలకు ధీటుగా.. ఏపీ ప్రభుత్వం విజయవాడలో దసరా వేడుకలను నిర్వహించింది. అయితే మొదటి ఏడాదే గిన్నిస్ రికార్డు సాధించింది. విజయవాడ ఉత్సవ్ లో వైబ్రేంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ను అందుకున్నారు. అనంతరం ఆ ప్రశంసా పత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. కార్నివాల్ లో డప్పు ర్యాలీ ఈ రికార్డును సొంతం చేసుకుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* ప్రత్యేకంగా కార్నివాల్..
ఏటా మైసూరులో( Mysore) దసరా వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది విజయవాడలో దసరా వేడుకలు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కార్నివాల్ వాక్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్నివాల్ వాక్ ర్యాలీని సీఎం చంద్రబాబు జండా ఊపి ప్రారంభించారు. డప్పు కళాకారుల ప్రదర్శన, కొమ్ము నృత్యం, పులి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిని చంద్రబాబు తిలకించారు. అనంతరం అవార్డుల ప్రధాన ఉత్సవంలో పాల్గొన్నారు. అయితే కార్నివాల్ కు గిన్నిస్ రికార్డు దక్కడం విశేషం. గిన్నిస్ రికార్డు సాధించినందుకు సీఎం చంద్రబాబు విజయవాడ ఉత్సవ నిర్వాహకులను అభినందించారు. విజయదశమి రోజున వేలమంది కళాకారులతో దసరా కార్నివాల్ నిర్వహించారు. అత్యధిక కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది. 40 కి పైగా కళాబృందాలు, మూడు వేల మందికి పైగా కళాకారులతో మెగా కార్నివాల్ వాక్ జరిగింది.
* వివాదం రేగినా..
అయితే ప్రారంభంలో దేవాదాయ శాఖకు సంబంధించిన వివాదం తలెత్తింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించారు. దసరా ఉత్సవ్ ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ నిర్వాహకులు గొల్లపూడి లో ఎక్స్ పో గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు దానిని సందర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రోబో వంటశాలను, వివిధ స్టాళ్లను పరిశీలించారు. మొత్తానికి అయితే విజయవాడ ఉత్సవ్ ఏపీకి కొత్త కళ తీసుకొచ్చింది.