AP Auto Drivers: ఏపీలో( Andhra Pradesh) ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయల చొప్పున అందించనున్నారు. దీనికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పేరును ఖరారు చేశారు. ఈ పథకానికి సంబంధించి రేపే ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంతో తాము ఉపాధికి దూరమవుతామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్ కు 15 వేల రూపాయలు సాయం అందించేందుకు నిర్ణయించింది. దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది వరకు ఆటో డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా తేలింది. రేపు వీరికి ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నారు.
* అప్పట్లో వాహన మిత్ర పేరిట..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో వాహన మిత్ర పేరిట పథకాన్ని అమలు చేసేవారు. 2019 ఎన్నికలకు ముందు నవరత్నాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఒక్కో ఆటో డ్రైవర్ కు ఏడాదికి పదివేల రూపాయల చొప్పున సాయం అందజేశారు. నాలుగు సంవత్సరాల పాటు ఈ సాయం అందించగలిగారు. అయితే అప్పట్లో రోడ్లు బాగా లేకపోవడంతో ఆటోలకు ఎక్కువగా మరమ్మత్తులు జరిగేవి. చలానాల రూపంలో వసూలు చేసే వారన్న విమర్శలు ఉండేవి. ఈ క్రమంలో పదివేల రూపాయల చొప్పున సాయం అందించిన అప్పట్లో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అయితే ఇప్పుడు అదే వాహనం మిత్రను.. ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరును మార్చి అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.
* 3 లక్షల మందికి పైగా అర్హులు..
రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా తేలినట్లు తెలుస్తోంది. రేపు వీరి ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున జమ కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, కార్మికుల మధ్య వేడుకగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఆటో కార్మికులు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోలకు పాలాభిషేకాలు వంటివి జరపనున్నారు. మొత్తానికి అయితే ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసి చూపిస్తోంది కూటమి సర్కార్. మరోసారి ఈ సంచలన పథకానికి శ్రీకారం చుట్టనుంది. వాస్తవానికి ఆటో డ్రైవర్ల సాయానికి సంబంధించి కూటమి ఎటువంటి హామీ ఇవ్వలేదు. కేవలం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి దూరమైంది. వారి విజ్ఞప్తి మేరకు చంద్రబాబు ఈ పథకానికి రూపకల్పన చేశారు. అయితే గతంలో వైసిపి హయాంలో పదివేల రూపాయలు మాత్రమే అందేది. ఇప్పుడు దానికి రూ.5000 అదనంగా అంటే 15000 రూపాయలు అందించనుండడం విశేషం.