Vijayawada CP on Margadarsi : మార్గదర్శి కేసు..ఎరక్కపోయి ఇరుక్కున్న విజయవాడ సీపీ

మార్గదర్శి కేసులో విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ఓ సాధారణ కేసులో ఆయన అతిగా వ్యవహరించి నవ్వులపాలయ్యారు. తాను కేసు కట్టిన నిందితుడికి రిమాండ్ విధించేందుకు కోర్టు తిరస్కరించడంతో నలుగురిలో పలుచన అయ్యారు.

Written By: Dharma, Updated On : July 22, 2023 11:02 am
Follow us on

Vijayawada CP on Margadarsi : అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుంది  ఏపీ పోలీసుల వ్యవహార శైలి. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలపై ఉక్కుపాదం మోపడం, ప్రభుత్వ బాధిత వర్గాలపైనే రివర్స్ కేసులు పెట్టడం రివాజుగా మారింది. అస్మదీయ కేసుల్లో వారు చూపుతున్న చొరవ మరీ అతిగా ఉంది. ప్రభుత్వం, పాలకపక్షం ప్రాపకం కోసం కొందరు పోలీసు అధికారుల తపన విమర్శలపాలవుతోంది. తాజాగా మార్గదర్శి కేసులో విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ఓ సాధారణ కేసులో ఆయన అతిగా వ్యవహరించి నవ్వులపాలయ్యారు. తాను కేసు కట్టిన నిందితుడికి రిమాండ్ విధించేందుకు కోర్టు తిరస్కరించడంతో నలుగురిలో పలుచన అయ్యారు.

మార్గదర్శిలో చిట్ వేసి పాడుకుంటే తనకు నగదు ఇవ్వకుండా తిప్పుతున్నారంటూ విజయవాడకు చెందిన ముష్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్పటి నుంచి యాక్షన్ సీక్వెల్ నడిచింది. సీపీ కాంతి రాణా తన స్థాయికి మించి వ్యవహరించారు. ఇంటర్నేషనల్ స్కాం స్థాయిలో బిల్డప్ ఇచ్చారు. రోజంతా మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్, సిబ్బందిని స్టేషన్ లో ఉంచారు. చివరి నిమిషంలో కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ సమస్యకు వేరే వేదికలు ఉన్నాయని..తమదాకా అవసరమే లేదని.. రిమాండ్ కు న్యాయమూర్తులు నో చెప్పారు. దీంతో సీపీ కాంతి రాణాకు చుక్కెదురైంది. నిందితుని రిమాండ్ కు అవసరం లేని కేసులో సీపీ అతి ఇప్పుడు సొంత శాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

శ్రీనివాసరావు టాక్స్ కన్సెల్టెంట్ తో పాటు కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వయిజర్ గా పనిచేస్తున్నారు. 2021 సెప్టెంబరు నుంచి లబ్బీపేట మార్గదర్శి బ్రాంచ్ లో నెలకు రూ.లక్ష చొప్పున 50 నెలల పాటు చిట్ కట్టేందుకు నిర్ణయించుకున్నాడు. 19 నెలల పాటు నెలకు రూ.లక్ష చొప్పున 19 లక్షలు చెల్లించాడు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ.37.50 లక్షలకు చిట్ పాడుకున్నాడు. కానీ అందుకు సంబంధించి ష్యూరిటీలు సమర్పించలేదు. దీంతో పాడుకున్న చిట్ నగదు విడుదల కాలేదు. చిట్ పాడుకున్న వ్యక్తి తప్పనిసరిగా ష్యూరిటీలు ఇవ్వాలని మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్, ఇతర సిబ్బంది పోలీసులకు విన్నవించుకున్నా వారు వినలేదు. ఇప్పుడది కోర్టులో నిలబడలేదు. కానీ పోలీస్ శాఖపై ఎటువంటి స్థాయిలో ఒత్తిడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. పోనీ ఎస్ఐ, సీఐ స్థాయిలో వ్యవహారం నడిచి ఉంటే సరిపోయేది. కానీ ఏకంగా సీపీయే ఎంటరై చేతులు కాల్చుకున్నారు.