Vijaysai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా ప్రభావం చాలా ఎక్కువ. ఇక్కడ మీడియా రెండుగా విడిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా కొన్ని ఛానెళ్లు.. ప్రతిపక్షానికి అనుకూలంగా కొన్ని ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయి. దీంతో ఎన్నిల్లో గెలుపోటములను కూడా అవే ప్రభావితం చేస్తున్నాయి. వ్యక్తిగత హననానికీ పాల్పడడంలోనూ వేటికవే సాటి. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ అధికార పార్టీ అనుకూల మీడియా ఇష్టానుసారం కథనాలు ప్రచారం చేసింది. వ్యక్తిగత విషయాలను కూడా ప్రసారం చేసింది. ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు కథనాలు వండి వార్చింది. దీంతో తనపై తప్పుడు వార్తలు రాసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అంతే కాదు.. ఎల్లోమీడియాకు ధీటుగా తాను కూడా ఓ ఛానెన్ పెడతానని తెలిపారు. చెప్పినట్లుగానే పంతం నెగ్గించుకున్నారు. వ్యక్తిగత జీవితంపై పుకార్లను ప్రచారంలోకి తెచ్చిన తొమ్మిది మీడియా సంస్థలకు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. భవిష్యత్ లో కూడా అలాంటి కథనాలు ఇవ్వకూడదని ఆదేశించింది.
ఏం జరిగిందంటే..
దేశాదాయ శాఖ కమిషనర్‌గా వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఓ మహిళా అధికారిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వేధించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా రాధాకృష్ణ నేతృత్వంలోని ఏబీఎన్ ఛానెల్ చిలువలు పలువలుగా కథనాలు ప్రసారం చేసింది. అవినీతి, అక్రమాలతోపాటు వివాహేతర సంబంధాలు అంటగట్టింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఇందులోకి ఈడ్చింది. తర్వాత మిగతా ఛానెళ్లు ఈటీవీ, ఆర్జీవీ, టీవీ–5, మహాన్యూస్‌తోపాటు పలు ఛానెళ్లు ఇలాంటి కథనాలనే ప్రసారం చేశాయి. అధికారి మహిళ అని కూడా చూడకుండా, ఆమె ఫొటోలు, వీడియోలు, కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలు, విజయసాయిరెడ్డి ఫొటోలు ప్రసారం చేసింది. వీటిని విజయసాయిరెడ్డితోపాటు సదరు మహిళా అధికారి కూడా ఖండించారు. అయినా ప్రసారం ఆగలేదు. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి తనకి సంబంధం లేని విషయంలో తన పేరుని ప్రస్తావించడమే కాకుండా, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేసేలా కథనాలు రాయడం సరికాదని ఇదివరకే విజయసాయిరెడ్డి ఆయా మీడియా సంస్థల్ని హెచ్చరించారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ రూ.10కోట్లకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. 9 మీడియా సంస్థలు తనపై ప్రసారం చేసిన కథనాలు తొలగించేలా ఆదేశాలివ్వాలని, భవిష్యత్‌లో ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ 9 ఛానెళ్లకు షాక్..
విజయసాయిరెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎబీఎన్, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ–5, మహాన్యూస్‌తోపాటు 9 ఛానెళ్లకు నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డిపై ప్రసారం చేసిన కథనాలను తొలగించాలని ఆదేశించింది. వాటన్నిటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇకపై ఇలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది. దీంతో మీడియా ఛానెల్ పెట్టకుండానే 9 ఎల్లో మీడియా ఛానెళ్లపై విజయసాయిరెడ్డి విజయం సాధించారు. ఇక త్వరలోనే చానెల్ కూడా ప్రారంభించబోతున్నారు.