Vijayasai Reddy: వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు సైతం రాజీనామా చేశారు. నేరుగా రాజ్యసభ చైర్మన్ వద్దకు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. వ్యక్తిగత కారణాలు చూపటంతో చైర్మన్ సైతం రాజీనామాను ఆమోదించారు. మరోవైపు వైసీపీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ పంపించారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుతుంది.
* వైయస్సార్ కుటుంబ విధేయుడు
వాస్తవానికి విజయసాయిరెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత వీధేయుడు. ఆ కుటుంబ ఆడిటర్ గా కూడా పనిచేశారు. కానీ జగన్కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఆయన అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జగన్ తో పాటు 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. వైసిపి ఆవిర్భావంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో అనూహ్య పరిస్థితుల్లో వైసీపీకి దూరమయ్యారు.
* అప్పట్లో షర్మిల టార్గెట్
అయితే వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు విజయసాయిరెడ్డి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వరకు జరిగిన వివాదాల్లో షర్మిలను తప్పుపడుతూ మాట్లాడారు విజయసాయిరెడ్డి. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. షర్మిల కు వ్యతిరేకంగా మాట్లాడారు. తీవ్ర స్థాయిలో పదజాలాలను కూడా ఉపయోగించేవారు. ముఖ్యంగా ఆమె కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరించిన తర్వాత విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయత కోల్పోయినందునే జగన్ నుంచి విధేయులంతా దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* మూడు గంటలపాటు సమావేశం
మూడు రోజుల కిందట హైదరాబాదులోని లోటస్ ఫండ్ లో షర్మిలను విజయసాయిరెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. ఆమెతో మూడు గంటలపాటు సమావేశం అయినట్లు సమాచారం. అక్కడే విజయసాయిరెడ్డి భోజనం కూడా చేశారని తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా షర్మిలను విజయసాయిరెడ్డి క్షమాపణ కోరినట్లు ప్రచారం నడుస్తోంది. అప్పట్లో జగన్ ఆదేశాల మేరకు మాట్లాడాలని.. తన మాటల్లో తప్పు ఉంటే క్షమించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిల తో విజయసాయిరెడ్డి సమావేశం పెను ప్రకంపనలకు దారితీస్తోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.