Mp vijayasaireddy: వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ తర్వాత ప్లేస్ ఆయనదే. పార్టీ ఆవిర్భావం నుంచి కాకుండా.. అంతకు ముందు నుంచే జగన్ వెంట అడుగులు వేశారు. ఒక సాధారణ చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటూ.. జగన్ పరిశ్రమల వ్యవహారాలను చూసుకునేవారు. అందుకే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎ2గా నిలిచారు. జగన్ తో పాటే జైలుకు వెళ్లారు. 16 నెలల జైలు జీవితం అనుభవించారు. వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహోరాత్రులు శ్రమించారు. టిడిపి తో బిజెపి విడిపోవడం వెనుక..అదే బిజెపి దయ వైసిపి పొందడం వెనుక కూడా విజయసాయిరెడ్డి కృషి ఉంది. వైసిపి తో పాటు జగన్ కోసం పెద్దల కాళ్లు పట్టుకునేందుకు సైతం విజయసాయి రెడ్డి సిద్ధపడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డికి సముచిత స్థానం దక్కుతూ వచ్చింది. రాజ్యసభ పదవికి ప్రమోట్ అవుతూనే వచ్చారు. రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. పార్టీతో ఇంతటి అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి.. వైసీపీని తాను వీడడం లేదని.. జగన్ వెంట ఉంటానని.. వేరే పార్టీలో చేరనని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అలా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం విజయసాయిరెడ్డికి ఎందుకు ఏర్పడింది? ఎవరైనా అనుమానించారా? పత్రికల్లో కథనాలు వచ్చాయా? అంటే సమాధానం లేదు. అయినా సరే తనకు తానుగా స్వయంగా వివరణ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ.
* ఆ ఇద్దరు తప్ప అందరూ
వైసీపీకి చాలామంది రాజ్యసభ సభ్యులు గుడ్ బై చెబుతారని కథనాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. మరో ఏడుగురు వరకు ఎంపీలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. వారు కూడా సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది.ఒక ఇద్దరు మాత్రం వైసీపీలో కొనసాగుతారని తెలుస్తోంది.
* విజయసాయిరెడ్డి పై అనుమానం లేదు
అయితే ఎల్లో మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో ఎక్కడా విజయసాయిరెడ్డి పార్టీ మారుతారని కథనాలు రాలేదు. ఆ అనుమానాలు కూడా ఎవరికి లేవు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం తాను పార్టీకి విధేయుడునని.. జగన్ వెంటే ఉంటానని.. చివరివరకు వైసీపీలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చుకున్నారు. అయితే తనకు తానుగా ఎందుకు ఈ వివరణ ఇచ్చారు అన్నది తెలియడం లేదు. ఒకవేళ వైసీపీలో ఆ అనుమానం ఉందా? లేకుంటే జగన్ నుంచి ఆ అనుమానం వినిపించిందా? అందుకే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అన్నది తెలియాల్సి ఉంది.
*ఆ రెండు పార్టీలు చేర్చుకోవు
ఇప్పటివరకు విజయసాయిరెడ్డి వ్యవహార శైలి అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఏ రేంజ్ లో ఆడి పోసుకునేవారో తెలిసిందే. ఆ రెండు పార్టీలు విజయసాయిరెడ్డిని చేర్చుకునే ఛాన్సే లేదు. బిజెపి సైతం విజయసాయిరెడ్డి విషయంలో మునుపటిలా ఆసక్తి కనబరచడం లేదు. ఆ మూడు పార్టీలు విజయసాయిరెడ్డిని చేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు. అటువంటప్పుడు విజయ్ సాయి రెడ్డి పార్టీ ఎలా మారుతారు. కేవలం జగన్ అనుమానించడంతోనే విజయసాయిరెడ్డి అలా ప్రకటన ఇచ్చి ఉంటారన్న అనుమానం కలుగుతోంది. మరి ఏం జరిగిందో ఆయనకే తెలియాలి.