Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పానని చెప్పిన ఆయన.. పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని చెప్పారు. నిన్ననే ఆయన మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడారు విజయసాయిరెడ్డి. తాను జగన్మోహన్ రెడ్డికి దూరం కాలేదని.. ఆయనే తనను దూరం చేశారని… కోటరీ మాటలను నమ్మి తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు సాయి రెడ్డి. అయితే ఆయన మాటలు చూస్తుంటే కోటరి సంగతి తేల్చి.. జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతానని సంకేతాలు పంపుతున్నారు. సరికొత్త ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి విషయంలో విధేయత చూపుతూనే ఉన్నారు.
* అంతర్గతంగా చాలా అంశాలు..
సాయి రెడ్డి మాటలు చూస్తుంటే అంతర్గతంగా చాలా అంశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణం కేసులు అప్రూవర్గా మారడం నుంచి బిజెపిలో చేరడం వరకు చాలా అంశాలు కనిపిస్తున్నాయి. జగన్ చుట్టూ ఉన్న వారి వల్లే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని.. వారే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. కూటమిని విడగొడితే తప్ప జగన్ గెలవలేరని.. ఆ పని చేయగల సమర్థత తనకే ఉందని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని సంకేతాలు పంపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తనను రానివ్వకుండా మధ్యలో కొందరు కావాలని అడ్డుపడుతున్నారని.. వారు దోచుకుంటున్న వైనాన్ని జగన్ గుర్తించడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. మరోవైపు హెచ్చరికలు కూడా పంపించారు జగన్కు సాయి రెడ్డి. తనను కాదని.. తన మాట వినకుండా కోటరీని నమ్మితే తాను అప్రూవర్ గా మారుతానని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. బిజెపిలో చేరుతానని హింట్ ఇస్తున్నారు.
* నమ్మని జగన్..
పాపం విజయసాయిరెడ్డి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి తన చుట్టూ ఉన్న కోటరిని మాత్రమే నమ్ముతున్నారు. అయితే ఇప్పటికీ జగన్ పై ప్రేమగానే మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి. వారిని దూరం పెడితే తాను దగ్గరవుతానని కూడా సూచిస్తున్నారు. అయితే జగన్ ఎవరి మాటలు వినే పరిస్థితిలో ఉండరు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి కూటమి విడిపోతేనే జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కుతుందని చెబుతున్నారు. 2018 మాదిరిగా ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీని బయటకు తరిమితేనే జగన్ అధికారంలోకి రాగలరని సాయి రెడ్డి భావన. అయితే కూటమి అంత ఈజీగా విడిపోదు. సాయి రెడ్డి బిజెపిలో చేరలేరు. జగన్మోహన్ రెడ్డి పిలవరు. అందుకే సాయి రెడ్డి ఏం చేయాలో పాలు పోవడం లేదు. వింత ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.