Vijaysai Reddy: విజయసాయిరెడ్డిని బలిపశువు చేశారే!

వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు ఆ పార్టీకి పెట్టని కోట. 2014, 2019 ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఆ పార్టీ సొంతం చేసుకుంది. హేమాహేమీ నాయకులు ఆ పార్టీలో ఉండేవారు.

Written By: Dharma, Updated On : March 7, 2024 4:13 pm

Vijaysai Reddy

Follow us on

Vijaysai Reddy: విజయసాయిరెడ్డిని బలి పశువు చేశారా? నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అందుకే నిలబెట్టారా? ఎవరు ముందుకు రాకపోవడం వల్లే ఆయనను ఎంపిక చేసారా? ఆయన ఓడిపోవడం ఖాయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెర వెనుక మంత్రాంగం నడిపించారే తప్ప నేరుగా బరిలో దిగిన సందర్భాలు లేవు. అయితే ఇప్పటికే నెల్లూరులో వైసీపీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పార్టీ నుంచి సీనియర్లు బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు విభేదాలతో కొనసాగుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నెల్లూరు వెళ్ళు అంటూ జగన్ విజయసాయిరెడ్డిని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు ఆ పార్టీకి పెట్టని కోట. 2014, 2019 ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఆ పార్టీ సొంతం చేసుకుంది. హేమాహేమీ నాయకులు ఆ పార్టీలో ఉండేవారు. కానీ ఒక్కొక్కరు బయటపడ్డారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి సిట్టింగులు పార్టీకి దూరమయ్యారు. తరువాత వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నమ్మకస్తులైన నేతలు సైతం వైసీపీలో ఇమడలేకపోయారు. నెల్లూరు సిటీ, రూరల్ ఇలా ఒక్కొక్కరు నేతలుపార్టీ నుంచి బయటకు వస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి అనిల్ నరసరావుపేటకు వెళ్ళిపోగా.. ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో విజయ్ సాయి రెడ్డి నెల్లూరులో ఎదురీదక తప్పదు.

వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో నెల్లూరు పార్టీ అధ్యక్షుడిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పుడు పార్టీకి ఉన్న ఏకైక దిక్కు కూడా ఆయనే. మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డికి స్వాగతం పలికే వారే లేకపోయారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి తన సొంత విద్యాసంస్థల విద్యార్థులను పంపించి స్వాగతం పలికారు. అసలు నెల్లూరు జిల్లాలో నాయకులు లేరు. ఉన్న వారంతా జూనియర్లే. అటు విజయ్ సాయి రెడ్డికి సొంత జిల్లా అయినా పెద్దగా పట్టు లేదు. ఉన్న నాయకులంతా వెళ్లిపోవడంతో తన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని పోటీ చేయిస్తానని చెప్పుకొచ్చారు. కానీ జగన్ వినలేదు. నువ్వే వెళ్ళాలి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి నెల్లూరులో అడుగు పెట్టారు. సరిగ్గా ఎన్నికల ముంగిట.. అధికారాలకు కత్తెరపడే సమయంలో విజయసాయిరెడ్డి నెల్లూరు రావడం విశేషం. అయితే విజయసాయిరెడ్డిని నిర్వీర్యం చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆడిన గేమ్ గా తెలుస్తోంది. లేకుంటే ఆకులు రాలిన చెట్టు మాదిరిగా ఉన్న నెల్లూరు వైసీపీకి విజయసాయిరెడ్డిని బాధ్యుడిగా చేయడం ఏంటి? ఇది ముమ్మాటికి బలి పశువు చేయడమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.