Vijayanagaram : ఏపీలో( Andhra Pradesh) ఉగ్ర మూలాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా మారుమూల విజయనగరంలో ప్రేరేపిత ఉగ్రవాదానికి యువకులు ఆకర్షితులు కావడం భయం గొలుపుతోంది. ఓవైపు పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి నుంచి కోలుకోక ముందే భారత్లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిన్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు చేదించారు. విజయనగరం జిల్లాలో ఇద్దరు అనుమానిత తీవ్రవాదులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్, సమీర్ అనే అనుమానిత తీవ్రవాదులు.. కర్ణాటక, మహారాష్ట్ర కు చెందిన నలుగురు యువకులతో కలిసి.. మొత్తం ఆరుగురు ఇన్ స్టాలో గ్రూప్ తయారు చేసుకుని సమాచారం పంచుకున్నట్లు తెలుస్తోంది. భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read : తీవ్ర నిర్ణయం దిశగా వల్లభనేని వంశీ మోహన్.. బెయిల్ పై వచ్చిన వెంటనే!
* ఐసిన్ హ్యాండ్లర్ ఆదేశాలతో..
సౌదీ అరేబియా లో( Saudi Arabia) ఉన్న ఐసిన్ హ్యాండ్లర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీరు బాంబులు కూడా తయారు చేసినట్లు పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం ఆరుగురిలో ఇద్దరికి బాంబులు తయారు చేసేలా.. మిగతా నలుగురికి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలో సౌదీ నుంచి ఐసిన్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం సిరాజ్, సమీర్ అనే ఇద్దరు యువకులు విజయనగరం జిల్లాలో బాంబులు తయారుచేసి వాటిని రంపచోడవరం అటవీ ప్రాంతంలో పరీక్షలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బాంబు పేలుళ్లకు వాడక ముందే పోలీసులు గుర్తించి వీరిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచాక మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.
* ఇంజనీరింగ్ పూర్తి చేసి..
సిరాజ్( Siraj ) విజయనగరంలోనే ఇంజనీరింగ్ వర్క్ చదువుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి తో పాటు సోదరుడు పోలీస్ శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయి నుంచి ఉగ్రవాద ఆసక్తి కనబరిచే వాడని సిరాజ్ విషయంలో పోలీసు దర్యాప్తులో తేలింది. నిత్యం ఆన్లైన్ లో ఉంటూ ఉగ్ర దాడికి సంబంధించి బాంబుల తయారీ వంటి వాటిని ఎక్కువగా సెర్చ్ చేసేవాడని సమాచారం. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన సిరాజ్ అక్కడ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి సిరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విజయనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
* విశాఖకు కూతవేటు దూరంలో విశాఖ( Visakhapatnam) నగరానికి కూత వేటు దూరంలో ఉంటుంది విజయనగరం. అభివృద్ధి చెందుతున్న నగరంలో విశాఖ ఒకటి. నగరంపై ఉగ్ర దాడి ఉంటుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు జల్లెడ పట్టారు. అయితే అనుకోని విధంగా విజయనగరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులు దొరకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఏపీవ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది. ఉగ్ర మూలాలు ఏపీని తాకడం కూడా ఒకరకంగా భయం నింపుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.