YS Vijayamma : సానుభూతి పై ఏర్పడిన పార్టీ వైసిపి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం, తండ్రి లేని పిల్లాడిపై కేసులువంటి కారణాలతో విపరీతమైన సానుభూతి ఏర్పడింది ఆ కుటుంబంపై. దానిని క్యాష్ చేసుకున్నారు జగన్. ఆ సానుభూతికి తన దూకుడు పనిచేసింది. ఆ దూకుడు వైసీపీ ఆవిర్భావానికి కారణమైంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సమకాలీకులు జగన్ లో తమ నేతను చూసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా తమకు జగన్ వద్ద గౌరవం దక్కుతుందని భావించారు. అయితే వైసిపి ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల వరకు సానుభూతి బాగానే పనిచేసింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వైసీపీకి బాగానే అక్కరకు వచ్చింది. కానీ ఇప్పుడు అదే వైయస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదంతో ఈ సానుభూతి కరిగిపోతోంది. రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలు ఇదే ఆలోచన మెదులుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఉన్న షర్మిలకు అన్యాయం జరుగుతుండడంతో ఎక్కువమంది నేతలు పునరాలోచనలో పడ్డారు.తమ సన్నిహిత నేత కుమార్తెకు న్యాయం జరగకపోవడంతో, ఆమె విషయంలో జగన్ మరింత దూకుడుగా ముందుకు సాగుతుండడంతో.. ఆయన వెంట ఉండడం వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు చాలామంది నేతలు. అందుకే వైసీపీ నుంచి రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. జగన్ తో రాజకీయాలు చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. అతని తీరుతో విసిగి వేసారి పోయిన చాలామంది ఎన్నికల ముందే పార్టీని వీడారు. ఇప్పుడు షర్మిలకు ఇబ్బంది పెడుతుండడంతో మరికొందరు వీడుతున్నారు.
* విజయమ్మ పై వ్యతిరేక కథనాలు
జగన్ ను సోదరి షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. పిసిసి అధ్యక్షురాలిగా ఆయనను టార్గెట్ చేసుకున్నారు. అధికారం నుంచి జగన్ ను దూరం చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అయితే ఇంతవరకు నడిచిన వ్యవహార శైలి ఒక విధంగా ఉంది. కానీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తి షేర్ బదలాయింపును తప్పుపడుతూ జగన్ తన తల్లి, చెల్లెలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేవలం తన బెయిల్ రద్దు చేయడానికి అలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతవరకు ఓకే కానీ.. అదే ఈడి అటాచ్మెంట్ లో ఉన్న సాక్షిలో మాత్రం స్వయంగా విజయమ్మకు వ్యతిరేకంగా కథనాలు రాయించడం విశేషం. దీనినే ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మాట అటు ఉంచితే.. సొంత పార్టీలో రాజశేఖర్ రెడ్డి అభిమాన నేతలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు.
* పవర్ లోకి వచ్చాక నిరాదరణ
షర్మిల వరకు ఓకే. ఆమె జగన్ పతనాన్ని కోరుకుంది. అయితే ఇక్కడే ఒక్క విషయం. అదే షర్మిల పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించారు. జగన్ కష్ట కాలంలో ఉంటే అండగా నిలిచారు. జగన్ జైలులో ఉంటే ఆయన తరుపున పాదయాత్ర చేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని మరీ ప్రచారం చేశారు. తీరా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దూరం పెట్టారు. అంతకు ముందు నుంచే వారి మధ్య ఒక రకమైన ఆస్తి వివాదాలు ఉన్నాయి. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా సోదరుడి విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాదరణకు గురయ్యారు షర్మిల. దానిని చూసి తట్టుకోలేక పోయారు తల్లి విజయమ్మ. సమస్యకు పరిష్కార మార్గం చూపాలనుకున్న జగన్ వైపు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకుండా పోయింది. అయితే ఈ పరిణామాలన్నీ తాజా ఘటనలతోనే బయటకు వస్తున్నాయి. అందుకే వైయస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే నేతలు.. జగన్ చర్యలను అసహ్యించుకుంటున్నారు. పార్టీ నుంచి బయటపడుతున్నారు.