Vijaya Sai Reddy: అసలు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) లక్ష్యం ఏంటి? ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెడుతున్నారు? మీడియా ఛానల్ ఏర్పాటు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? పొలిటికల్ సర్కిల్లో ఇదే ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు పార్టీలు ప్రకటించిన వారంతా చరిష్మ ఉన్నవారు. కానీ విజయసాయిరెడ్డి విషయానికి వచ్చేసరికి ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి వెనుక పని చేశారే తప్ప.. ఆయనకంటూ ఒక సొంత ఇమేజ్ లేదు. పైగా వివాదాస్పద ముద్ర ఉంది. కానీ రాజకీయ పార్టీ ఏర్పాటు వెనుక అసలు వ్యూహం ఏంటనేది తెలియడం లేదు. పైగా మీడియా ఛానల్ ఏర్పాటుకు సమాంతరంగా రాజకీయాలు చేస్తామనడం మాత్రం ఏదో ఒక లక్ష్యంతో అన్నట్టు కనిపిస్తోంది. కచ్చితంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఈ చర్యకు దిగినట్లు అర్థమవుతోంది.
ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వెనుక ఉండి ఇలా చేయిస్తారు అనుకోవడం ఎంత మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మీడియా ఉంది. ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఈ సమయంలో విజయసాయిరెడ్డి పార్టీ పెడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కరం. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన నాయకుడు. ఆయన పార్టీ పెడితే తప్పకుండా ఆ ప్రభావం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. పైగా విజయసాయిరెడ్డి తో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిస్తే అది అంతిమంగా వైసీపీకి నష్టం. ఇప్పటికే వైసీపీకి సాక్షి మీడియాతో పాటు అనుకూల మీడియా చాలా వరకు ఉంది. కొత్తగా విజయసాయిరెడ్డితో మీడియాను ఏర్పాటు చేసే అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం లేదు.
* సమీప బంధువులు కావడంతో..
పోనీ చంద్రబాబు ( CM Chandrababu ) ఇలా చేయిస్తున్నారు అంటే మాత్రం కొంతవరకు నమ్మవచ్చు. ఎందుకంటే చంద్రబాబుతో సాయి రెడ్డికి బంధుత్వం ఉంది. నందమూరి తారకరత్న భార్యకు విజయసాయిరెడ్డి స్వయానా చిన్నాన్న అవుతారు. అప్పట్లో తారకరత్న చనిపోయే సమయంలో విజయసాయిరెడ్డి అన్ని తానై వ్యవహరించారు. అటు చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ సైతం విజయసాయిరెడ్డి తో ప్రత్యేకంగా గడపాల్సి వచ్చింది. అటు తరువాతనే జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డికి ఒకలాంటి గ్యాప్ ఏర్పడింది. పార్టీకి దూరమైన క్రమంలో విజయసాయిరెడ్డి పై జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవన్నీ చంద్రబాబుతో విజయసాయిరెడ్డి దగ్గర కావడం వల్ల జరిగిన పని అంటూ అనుమానాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు విజయసాయిరెడ్డి తో ఈ పని చేయించి ఉంటారన్న అనుమానాలకు ఎంతో కొంత బలం చేకూరుస్తోంది.
* తీవ్ర అవమాన భారంతో..
అయితే ఏకకాలంలో మీడియా ఏర్పాటుతో పాటు కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. అయితే గెలుపు ఓటములను పక్కన పెడితే విజయసాయిరెడ్డి ఎవరినో విపరీతంగా టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత చేయాలో అంత చేశారు విజయసాయిరెడ్డి. 16 నెలల జైలు జీవితాన్ని గడిపారు జగన్మోహన్ రెడ్డి తో కలిసి. వైసీపీ నే అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు వడ్డారు. గౌరవభావం సంపాదించుకున్నారు. పదవులు అనుభవించారు. కానీ ఇవన్నీ నాణానికి ఒకవైపే. జగన్మోహన్ రెడ్డి వల్ల గౌరవ భావాన్ని కోల్పోయారు. కేసులను ఎదుర్కొన్నారు. అవమానాలు కూడా పడ్డారు. అయితే తన ఈ పతనానికి జగన్మోహన్ రెడ్డి కారణం అన్నది విజయసాయిరెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఆయనను టార్గెట్ చేసుకుని మీడియాతో పాటు కొత్త పార్టీ ఏర్పాటు అన్నది ఒక అనుమానం. దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలి.
