Phone Tapping Case
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో అధికారి పేరు బయటకు వచ్చింది. రోజుకో మలుపు తిరుగుతూ, ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతున్న ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో రిటైర్డ పోలీస్ అధికారి వేణుగోపాలరావు పేరు బయటకు వచ్చింది. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. బుధవారం విచారణకు రావాలని పేర్కొన్నారు. వేణుగోపాలరావును విచారణ చేసిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది.
ఎవరీ వేణుగోపాలరావు..
వేణుగోపాలరావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్పీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం వేణుగోపాలరావును ఎస్‌ఐబీలో అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ)గా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు నియమించారు. ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుతో కలిసి వేణుగోపాలరావు కూడా ప్రతిపక్షాలపై నిఘా పెట్టారని సమాచారం.
ఎస్సై నుంచి ఏఎస్పీ వరకు..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పర్వతగిరికి చెందిన వేణుగోపాలరావు 1989 బ్యాచ్ ఎస్సై. 2005లో కరీంనగర్ రూరల్ సీఐగా పనిచేశారు. అప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ అతనిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వేణుగోపాల్‌రావు సస్పెండ్ కూడా అయ్యారు. తర్వాత జమ్మికుంట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చిగురుమామిడి మండలంలో వేణుగోపాల్ నేతృత్వంలో లాకప్‌డెత్ కూడా జరిగింది. ఈ ఘటనలో మరోసారి సస్పెండ్ అయ్యాడు.
2013లో ప్రమోషన్..
రెండు సార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన్పటికీ 2013లో వేణుగోపాల్‌రావుకు పదోన్నతి లభించింది. పెద్దపల్లి డీఎస్పీగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఎల్బీనగర్‌లో చివరి పోస్టింగ్. ఎల్బీనగర్ ఏసీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత ఎస్‌ఐబీలో ఓఎస్డీగా కొనసాగారు. ఏడేళ్లు ఎస్‌ఐబీలో పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఈయన పేరు తెరపైకి వచ్చింది. మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వేణుగోపాలరావు పేరు పేర్కొన్నారు.