Vemreddy Prabhakar Reddy : వైసీపీలో అవమానం.. టిడిపిలో గౌరవం.. అదే చాలంటున్న ఆ సీనియర్ నేత!

వైసీపీని విభేదించి చాలామంది నేతలు టిడిపిలోకి వచ్చారు. అవమాన భారంతోనే ఎక్కువ మంది ఆ పార్టీని వీడారు. అటువంటి వారి విషయంలో చంద్రబాబు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారు సంతృప్తిగా ఉండేలా గౌరవిస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 2, 2024 3:55 pm
Follow us on

 

Vemreddy Prabhakar Reddy : రాజకీయాల్లో కొందరు డబ్బు ఆశిస్తారు. మరికొందరు గౌరవం ఆశిస్తారు. తమకు గౌరవం లేని చోట పెద్ద పదవులు దక్కినా అక్కడ ఇమడలేరు. అనివార్య పరిస్థితుల్లో సైద్ధాంతికంగా వ్యతిరేకించే పార్టీలో చేరినా ఎక్కువ కాలం కొనసాగలేరు. ఇది చాలా సందర్భాల్లో వెల్లడయింది కూడా. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. దానం నాగేందర్ కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపిలో చేరారు. టిడిపి టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో క్షణాల్లోనే టీడీపీ శాసనసభ్యుడిగా రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే దీనిపై విమర్శలు ఉన్నా.. అలా చేయడం తప్పైనా నచ్చని పార్టీలో కొనసాగలేక ఆ పని చేశారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కుతుందని భావించారు. ముఖ్యంగా రాజకీయాల్లో గౌరవం అన్న అంశం చాలా ప్రాధాన్యత ఉంటుంది. తాజా ఎన్నికల్లో గౌరవం దక్కని చాలామంది నేతలు వైసీపీని వీడారు. అటువంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా మెలిగారు. జగన్ తో పాటు వైసీపీకి కష్టకాలంలో అండగా నిలిచారు. ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచారు. కేవలం ఆయనకు వైసీపీలో గౌరవం దక్కలేదన్న ఆవేదనతోనే పార్టీని వీడారు. ఆయన వెంట వేలాదిమంది వైసీపీ శ్రేణులు కూడా నడిచారు. కేవలం జగన్ గౌరవం ఇవ్వలేదన్న బాధతోనే పార్టీని వీడారు. వైసీపీకి కోలుకోలేని దెబ్బ తీశారు. గత రెండు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉనికి చాటుకోలేని టిడిపికి ఏకపక్ష విజయం అందించారు వేం రెడ్డి. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన భార్య పోటీ చేసి గెలిచారు.

* చేజేతులా దూరం చేసుకున్న జగన్
జగన్ చేజేతులా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దూరం చేసుకున్నారు. వైసీపీలోకి వచ్చిన వేంరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా అప్పగించారు. కానీ వైసీపీలో గౌరవం కోరుకున్నారు వేంరెడ్డి. అనిల్ కుమార్ యాదవ్ కోసం వేంరెడ్డిని తక్కువ చేశారు జగన్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు తొలి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. విస్తరణలో మంత్రి పదవి నుంచి తొలగించి కాకాని గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు. అయితే దీనికి వేంరెడ్డి కారణం అంటూ అనుమానించారు అనిల్. చాలా రకాలుగా అవమానించారు. దానిని నియంత్రించకుండా అదే అనిల్ కుమార్ యాదవ్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చి నరసరావుపేట పంపించారు. ఇది వేం రెడ్డికి నచ్చలేదు. తనకంటే అనిల్ కుమార్ యాదవ్ కు అధికంగా గౌరవించి.. తనను అవమానించారని భావిస్తూ ఆయన టిడిపిలోకి వచ్చారు.

* ఎనలేని ప్రాధాన్యం
వైసీపీలో జరిగిన పరిణామాలను గుర్తించారు చంద్రబాబు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని సైతం పరిగణలోకి తీసుకున్నారు.కూటమి ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు.అందుకే ఒక పదవి విషయంలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవిని తీసుకోవాలని చంద్రబాబు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పదవికి తాను న్యాయం చేయలేనని.. వ్యాపారంలో బిజీగా ఉంటానని.. ఇంకెవరికైనా ఆ పదవి ఇవ్వాలని కోరినట్లు టాక్ నడుస్తోంది. తాను కోరుకుంది గౌరవమే తప్ప పదవులు కాదని చంద్రబాబుకు స్వయంగా విన్నవించినట్లు సమాచారం. అందుకే చంద్రబాబు వేంరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారని.. టిడిపి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందని బదులిచ్చినట్లు పార్టీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం నడుస్తోంది.

* అక్కడ ఎన్నో అవమానాలు
వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. తన సొంత పార్టీగా భావించి పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు సమకూర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం దూకుడుగా వ్యవహరించే అనిల్ కుమార్ యాదవ్ కోసం తనను వదులుకోవడానికి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు తనకు ఇస్తున్న గౌరవాన్ని గుర్తుచేసుకొని ఆనందపడుతున్నారు. తనకు పని చేసుకునే స్వేచ్ఛ దొరుకుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు పెద్ద పదవిని ఆఫర్ చేయడానికి కూడా మరింత ముగ్ధుడయ్యారు. వైసీపీలో లేనిది టిడిపిలో దొరుకుతుందని సన్నిహితులు వద్ద చెబుతున్నారు.