Vemireddy Prabhakar Reddy: వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆయనకు టిడిపి నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన టిడిపిలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపారని.. సానుకూలంగా ఈ భేటీ సాగిందని.. త్వరలో భార్యతో పాటు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే జగన్ కు షాక్ ఇచ్చినట్లే. నెల్లూరు జిల్లాలో వైసిపికి ఎదురు దెబ్బ తగిలినట్లే.
వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి ఆర్థికంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు సమకూర్చినట్లు విపక్షాలే ఆరోపిస్తుంటాయి. అటు జగన్ సైతం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేశారు.వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వేంరెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో కొనసాగలేనని.. టిడిపిలో చేరడం ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. దీంతో అక్కడ వైసిపి ఇన్చార్జిగా నెల్లూరు సిటింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. దీంతో ఎంపీ సీటు ఖాళీ అయ్యింది. బలమైన అభ్యర్థిగా భావించి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే పార్లమెంట్ స్థానం పరిధిలోని అభ్యర్థులను మార్చితేనే తాను పోటీ చేస్తానని వేంరెడ్డి షరతు పెట్టారు. అందుకు జగన్ ఒప్పుకోవడంతో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ అభ్యర్థుల మార్పు విషయంలో జగన్ వేంరెడ్డిని కనీసం సంప్రదించలేదు. దీంతో మనస్థాపంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా చంద్రబాబును కలిసి టీడీపీలోకి వస్తానని చెప్పడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
వాస్తవానికి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ కు అత్యంత నమ్మకస్తుడు. కానీ ఎందుకో ఆయన విషయంలో జగన్ మాట తప్పారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో వేంరెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఆయనను మార్చితేనే తాను పోటీ చేస్తానని వేంరెడ్డి తేల్చి చెప్పారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి అనిల్ చెప్పిన ఖలీల్ ను ఖరారు చేశారు. అక్కడ వేంరెడ్డి భార్య పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉండేది. కానీ వేం రెడ్డికి కనీసం సంప్రదించకుండా.. అనిల్ ఒత్తిడి మేరకు ఖలీల్ ను నియమించారు. ఇది వేంరెడ్డి మనస్థాపానికి ప్రధాన కారణం. అందుకే వైసీపీలో ఉండడం వేస్ట్ అని.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తన విషయంలో అన్యాయం జరిగిందని వేంరెడ్డి భావించారు. అందుకే టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.