Vamsadhara River Flood: ఉత్తరాంధ్ర పై( North Andhra ) వాయుగుండం పెను ప్రభావం చూపింది. వాయుగుండం ఒడిస్సా లోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటింది. అయితే బలహీనపడినా శ్రీకాకుళం తో పాటు ఒడిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా వంశధార నదికి వరద నీరు పోటెత్తుతోంది. నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వంశధార అధికారులు అప్రమత్తం అయ్యారు. గొట్టా బ్యారేజీ వద్ద 22 గేట్లను పూర్తిగా ఎత్తివేసి కిందకు నీటిని విడిచి పెడుతున్నారు. మరోవైపు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. దీంతో వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
* ఒడిస్సా కొండల్లో పుట్టి..
వంశధార నది ఒడిస్సా లోని కొండ ప్రాంతాల్లో పుడుతుంది. ఒడిస్సా కంటే శ్రీకాకుళం జిల్లాలోని ఎక్కువ గా ప్రవహిస్తుంది. భామిని, కొత్తూరు, పాతపట్నం, హిరమండలం, ఎల్ ఎన్ పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, శ్రీకాకుళం రూరల్, గార మండలాల మీదుగా ప్రవహిస్తుంది. అయితే ఏటా వరదల సమయంలో వంశధార పోటేత్తడం పరిపాటిగా మారింది. వందలాది గ్రామాలకు వరద నీటి ముప్పు తప్పదు. వేల ఎకరాల్లో పంట నీట మునుగుతుంది.
* పూర్తిగా గేట్లు ఎత్తివేత..
ప్రస్తుతం హిరమండలం మండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార భారీగా ప్రవహిస్తోంది. వరద నీటి తీవ్రత అధికంగా ఉంది. అధికారులు అప్రమత్తమై యధావిధిగా నీటిని కింద ప్రాంతాలకు విడిచిపెడుతున్నారు. జలప్రళయం చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే గురువారం కురిసిన వర్షం.. రాత్రి వరకు కొనసాగి ఉంటే మాత్రం ఒకటో ప్రమాద హెచ్చరిక తప్పకుండా ఎగురవేయాల్సి వచ్చేది. కానీ ఒడిస్సా లోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. క్రమేపీ నదిలో వరద నీరు తగ్గే అవకాశం ఉంది.