Devaragattu: సాధారణంగా ఉత్సవాలు వేడుకగా జరుపుకుంటారు. సందడిగా నిర్వహిస్తారు. కానీ అక్కడ మాత్రం హింస మాదిరిగా వేడుకలు జరుపుకోవడం విశేషం. అయితే ఈసారి ఆ వేడుకలు శృతి తప్పాయి. ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. కర్నూలు జిల్లా దేవర గుట్టలో ఈ విషాదం విజయదశమినాడు చోటుచేసుకుంది. ఇక్కడ ఏటా దేవరగుట్టలో బన్నీ ఉత్సవాల పేరిట వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజున పరిసర గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడతారు. ఇది కర్రల సమరంగా అభివర్ణిస్తుంటారు. అయితే ఈ ఉత్సవం హింసాత్మక పద్ధతిలో జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా ఉత్సవాల్లో పాల్గొనేవారు గాయపడటం జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఏకంగా ఇద్దరు మరణించారు కూడా. గత ఏడాది జరిగిన వేడుకల్లో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు ఈ ఏడాది అప్రమత్తమయ్యారు. కానీ విషాదాన్ని అడ్డుకోలేక పోయారు.
* సుదీర్ఘ చరిత్ర
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు కర్రల సమరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ దేవరగుట్ట ప్రాంతంలో కొండల్లో ఋషులు తపస్సు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారు. ఇదే ప్రాంతంలో మని, మల్లాసురులు అనే రాక్షసులు సైతం ఉండేవారు. లోక కళ్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజాది కార్యక్రమాలకు రాక్షసులు అడ్డంకులు సృష్టించేవారు. అప్పట్లో మునులు బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. అయితే అది విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచించడంతో.. మునులు వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని కలిసి సాయం అడిగారు. అయితే మని, మల్లాసురులు శివుని భక్తులని.. వారిని సంహరించడం తన వల్ల కాదని విష్ణుమూర్తి తేల్చి చెప్పారు. దీంతో మునులు కైలాసానికి వెళ్లి శివుడిని వేడుకుంటారు. దీంతో శివుడు విజయదశమి రాత్రి కూర్మావతారంలో మూలవిరాట్ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించడానికి దేవర గుట్ట కొండపై ప్రత్యక్షమవుతారు. రాక్షసులను సంహరిస్తారు. అయితే చనిపోయే ముందు రాక్షసులు ప్రతి సంవత్సరం నరబలి ఇవ్వమని ప్రార్థించగా.. అందుకు శివుడు తిరస్కరిస్తాడు. దానికి బదులు రక్షపదలో పిడికెడు రక్తాన్ని ఇచ్చాడు. అందువల్లే ప్రతి ఏటా విజయదశమి రోజున ఈ కర్రల సమరం జరగడం.. నెత్తురు కారడం ఆనవాయితీగా వస్తోంది.
* పోటా పోటీగా సమరం
విజయదశమి రోజు సమీప ఏడు గ్రామాల ప్రజలు వేరువేరుగా సమూహాలుగా ఏర్పడతారు. మాళ మల్లేశ్వర స్వామి, పార్వతి దేవి విగ్రహాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడతారు. అయితే ముందుగా స్వామివారి నిశ్చితార్థం, ధ్వజారోహణం జరుగుతుంది. అనంతరం ఉత్సవ విగ్రహాలను కొండపైకి తీసుకెళ్తారు. లోహపు ఉంగరాల చిట్కాలతో కూడిన పొడవైన కర్రలను, మండుతున్న జ్వాలలను తీసుకుని నృత్యం చేయడానికి, విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపును తమ గ్రామాల వైపు మళ్ళించేందుకు మరికొందరు ప్రయత్నిస్తారు. దీంతో రెండు వర్గాల భక్తులు ఘర్షణ పడతారు. అలా కర్రలతో సమరానికి దిగుతారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్సవంలో విషాదాన్ని నింపారు.