Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని కలవనున్నారు. రేపు మూలాఖత్ లో వల్లభనేని వంశీని కలిసి పరామర్శించునున్నారు. కొద్ది రోజుల కిందట హైదరాబాదులో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్.
* జైలు వద్ద భద్రత
అయితే వల్లభనేని వంశీ( Vallabha neni Vamsi) అరెస్టు నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలు వద్ద భద్రతను పెంచారు. ప్రధానంగా వంశీని ఉంచిన సెల్ వద్ద అదనంగా గార్డులను నియమించారు. తోటి ఖైదీలు అక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ వద్ద అడ్డంగా ఒక వస్త్రాన్ని కట్టారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి కేసుల నిందితులు ఉండడంతో.. వారి నుంచి ప్రాణహాని ఉందన్న అనుమానాల నేపథ్యంలో భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీకి జైలులో ప్రాణహాని ఉందని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం విశేషం.
* మూలాఖత్ లో
విజయవాడ జిల్లా జైలులో( Vijayawada district jail) ఉన్న వల్లభనేని వంశీని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మూలాఖత్ లో కలవనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి. రేపు విజయవాడ రానున్నారు. నేరుగా జైలుకు వెళ్లి వంశీని కలుస్తారు. పార్టీ అండదండగా ఉంటుందని.. ఎటువంటి ఆందోళనలు పడకుండా ఉండాలని ధైర్యం చెప్పనున్నారు. ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ కుటుంబ సభ్యులను సైతం జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు వంశీ. ఎన్నికల ఫలితాల తరువాత విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం నడిచింది. కానీ ఆయన హైదరాబాదులో అరెస్టు కావడంతో అది ఉత్త ప్రచారం అని తేలిపోయింది.
* టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి..
2019 ఎన్నికల్లో టిడిపి( Telugu Desam Party) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. కానీ కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై హాట్ కామెంట్స్ చేసేవారు. ఒకానొక దశలో చంద్రబాబు సతీమణి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు తరువాత చాలామంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అందుకే పార్టీ శ్రేణులకు ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని కలవనున్నారు.