Vallabhaneni Vamsi Mohan: వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొత్త కేసులు చుట్టుముట్టడంతో అనుచరులతో కలిసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. అయితే ఆది నుంచి వల్లభనేని వంశీ విషయంలో ఒక దూకుడు కనిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆయన టిడిపి ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయించారు సరే. కానీ అదే పనిగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. వాస్తవానికి వల్లభనేని వంశీ మోహన్ పై కొత్తగా కేసులు నమోదు చేయలేదు కూటమి ప్రభుత్వం. తనకు తానుగా చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వంశి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి శ్రేణులపై ఆయన దాడి చేయించారు. దీంతో ఆయనతో పాటు అనుచరులపై కేసు నమోదు అయింది. ఎక్కడ అరెస్టు చేస్తారేమోనని ఆయన పరారీ అయ్యారు. కోర్టుల నుంచి తన అరెస్టు విషయంలో సానుకూలత వచ్చేవరకు ఆయన పరారీ లోనే ఉంటారు.
వైసీపీలోకి ఫిరాయింపు..
వల్లభనేని వంశీ మోహన్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచారు. టిడిపిలో గెలిచి వైసీపీలో ఫిరాయించారు. అయితే నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబుతో పాటు లోకేష్ ను డామేజ్ చేయాలని చూశారు. కానీ అది వర్కౌట్ కాలేదు సరి కదా ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు వంశీ మోహన్. ఇప్పటికే జైలుకు వెళ్లి అనారోగ్యానికి గురయ్యారు. రాజకీయంగా కూడా అంత యాక్టివ్ కాలేకపోతున్నారు. మరోసారి అజ్ఞాతంలోకి అంటే ఎప్పటికైనా మళ్లీ అరెస్టు జరిగే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గన్నవరం విషయంలో ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. వంశీని సైడ్ చేసి కొత్త నేతను తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వైసిపి ఓటమికి కారణం..
వల్లభనేని వంశీ విషయంలో జరిగిన వ్యవహారం పై ఎవరూ నోరు మెదపడం లేదు. పైగా సానుభూతి చూపించడం లేదు. నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని అభిమానించి.. సంప్రదాయ రాజకీయానికి అలవాటు పడిన ఏ ఒక్క నేత అప్పట్లో వల్లభనేని వంశీ వాడిన భాష, వ్యాఖ్యలను ఇష్టపడలేదు. వైయస్సార్ పార్టీ ఓటమికి ఇటువంటి నేతలే కారణం అన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ మోహన్ కోసం వెయిట్ చేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకే ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యామ్నాయ నాయకత్వం సిద్ధం..
గన్నవరంలో ప్రత్యామ్నాయ నాయకులు చాలామంది ఉన్నారు. వారందరూ యాక్టివ్ అవుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత ఒకరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికే బలమైన నాయకత్వం ఉండగా గన్నవరం టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు 2014లో వల్లభనేని వంశీ మోహన్ కు. 2019లో సైతం రెండోసారి టిక్కెట్ ఇచ్చారు. రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడారు వల్లభనేని వంశీ మోహన్. కానీ ఇప్పుడు ఎవరికోసమైతే ఇదంతా చేశారో అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు. తప్పకుండా గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జ్ రావడం ఖాయం అని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.