Vahana Mitra scheme 2025: దసరా సమీపిస్తోంది. ఈనెల 22 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వాహన పూజలు సైతం జరగనున్నాయి. అంతకంటే ముందే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం( vahan Mitra scheme) కింద 15 వేల రూపాయల చొప్పున సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. వాహన మిత్ర పథకం కింద నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు అక్టోబర్ 1 ని ముహూర్తంగా నిర్ణయించింది. రేపటి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా వెల్లడించింది. అన్ని సచివాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అధికారులు.
డిక్లరేషన్ తప్పనిసరి..
సచివాలయంలో అందించే దరఖాస్తుల్లో.. దరఖాస్తుదారుని పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, కుల ధ్రువీకరణ పత్రం నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ పేరుతో బ్యాంకు వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పొందుపరచాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం నంబర్, చిరునామా, వాహన రకం, వాహన గుర్తింపు సంఖ్య, చెల్లుబాటు అయ్యే తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, జారీ చేసిన తేదీ, కార్యాలయం వంటి వివరాలను ఆ దరఖాస్తులు పొందుపరచాలి. ఆ వివరాలన్నీ వాస్తవం అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో అవాస్తవం అని తేలితే చర్యలకు బాధ్యుడిని అని అందులో పొందుపరిచి ఉంటుంది. అందుకే ఒకటి రెండుసార్లు ఆలోచించి డిక్లరేషన్ ఇవ్వడం మంచిది.
మూడు రోజుల పాటు..
రేపటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. మూడు రోజులపాటు ఈ ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసి గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 22 లోపు వెరిఫికేషన్లు పూర్తి చేస్తారు. 24న జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలన్నీ రవాణా శాఖకు చేరుతాయి. అక్కడ నుంచి వచ్చిన క్లియరెన్స్ ప్రకారం తుది జాబితా విడుదల చేయనున్నారు. అయితే అక్టోబర్ 1న ప్రతి ఆటో డ్రైవర్ అకౌంట్లో నిధులు జమ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి తప్పనిసరి
అయితే వాహన మిత్రకు సంబంధించి ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ మాత్రం తప్పనిసరి. కేవలం ఏపీలో జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే ఉండాలి. వాహనం కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ ట్యాబ్ లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా అనుమతిస్తారు కానీ ఒక్క నెలలో సమర్పించాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మాత్రం వారు అనర్హులు. విద్యుత్ వినియోగం 3 యూనిట్ల కంటే అధికం ఉన్న వాహన మిత్రకు అనర్హులవుతారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేపటి నుంచి ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.