Vahana Mitra: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో ప్రతిష్టాత్మక పథకానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో వాహన మిత్ర పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పథకంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు ఏటా ఆర్థిక మృతి అందించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. వాస్తవానికి ఈ పథకం మేనిఫెస్టోలో లేదు. కానీ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ తగ్గింది. దీనిపై ఆటో డ్రైవర్ల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. తప్పకుండా ఆదుకుంటామని స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన నాడే చెప్పారు. ఇప్పుడు ఈ పథకాన్ని అక్టోబర్ 1న ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఆరోజు ఆటో డ్రైవర్ల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.
* వీరు అర్హులు..
సొంతంగా ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. వీరికి మాత్రమే వాహన మిత్ర కింద 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, బీమా, మరమ్మత్తులు వంటి అవసరాల కోసం అక్కరకు వచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. తాజాగా ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు, నిధుల విడుదల తేదీలను ప్రకటించింది. సీఎం చంద్రబాబు అక్టోబర్ 1 న లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రకారం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇవి ఖచ్చితంగా ఉండాలి..
* లబ్ధిదారులు ఏపీలో జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
* ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.
* వాహనం ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
* మోటార్ క్యాబ్, మ్యాక్సీ ట్యాబ్ లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.
* అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు లేకపోయినా అనుమతిస్తారు.
* కానీ ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
* పథకం ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సికాబ్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది.
* లబ్ధిదారులు బిపిఎల్ గా ఉండాలి. ముఖ్యంగా రేషన్ కార్డు తప్పనిసరి.
* కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు.
* పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
* ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు కంటే తక్కువ ఉండాలి. దీనికోసం దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటును లెక్కిస్తారు.
* వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలానాలు ఉండకూడదు.
* పది ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస స్థలం ఉంటే అనర్హులే.
* సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నెంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తో కూడిన వివరాలను ప్రభుత్వం జిఎస్డబ్ల్యూఎస్ కు అందించనుంది. 2023- 24 లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాహన మిత్ర పథకం అందించిన సంగతి తెలిసిందే. వాటిని సైతం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారు.