AP Local Body Elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం అయింది. పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం నాలుగు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేసి పదవీ విరమణ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే అధికార పార్టీలో సన్నాహాలు ప్రారంభం అయ్యాయి కానీ.. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కదలిక లేదు. కేంద్ర బలగాల సాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తేనే అన్నమాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా తీసుకుంటుందో అర్థమవుతోంది. గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* జగన్ నియమించిన కమిషనర్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నో రకాల ట్విస్టులు కొనసాగాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అదే సమయంలో కరోనా వచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తన ఆదేశాలు పాటించలేదని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి అంటూ తప్పించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ చివరకు కోర్టు ఆదేశాలతో నియమితులయ్యారు నిమ్మగడ్డ. ఆయన కమిషనర్ గా ఉండగానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ఉన్నారు. ఆమె జగన్ హయాంలో నియమితులయ్యారు. కానీ ఇప్పుడు ఆమె ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలు పెడితే ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వచ్చింది. ఇప్పటికే ఆమె నేతృత్వంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికలు జరిగాయి. ఆమెపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల ఒత్తిడిలు వెళ్లాయి. కానీ ఆమె పెద్దగా చలించలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ స్థాయిలో? ఎలా జరుగుతాయో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అర్థమయింది. అందుకే ఎన్నికలను బహిష్కరించేందుకు ఆ పార్టీ ఇప్పటినుంచే కారణాలను వెతుక్కుంటుంది.
* ఆ ఓటమితో
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడే ఆ పార్టీలో ఆశావహులు ముందుకు వచ్చే అవకాశం లేదు. కనీసం పార్టీ పిలుపు ఇస్తున్న కార్యక్రమాలకు సైతం పార్టీ శ్రేణులు హాజరవుతున్న దాఖలాలు లేవు. పులివెందులతో పాటు ఒంటిమిట్టలో వచ్చిన ఫలితం పార్టీ శ్రేణులకు తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు జాతీయస్థాయిలో అధికారంలో ఉన్నప్పుడే.. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అటువంటిది ఇప్పుడు ఈ రెండు జెడ్పిటిసి ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ఆ పార్టీకి చాలా నష్టమే. పార్టీలో ఒక అపనమ్మకాన్ని, నైరశ్యాన్ని అలుముకునేలా చేసింది ఈ ఫలితం. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్ కట్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానికి కారణాలు చెప్పుకునేందుకే.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. ఒక పద్ధతి ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?