Uttarandhra YCP: ఉత్తరాంధ్ర వైసీసీలో ముసలం ప్రారంభమైంది. ఆ పార్టీపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. మరికొందరు వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన గందరగోళం నెలకొంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ముఖ్యంగా ఎన్నికల ముందు అభ్యర్థుల మార్పుతో హై కమాండ్ వివాదాలకు ఆజ్యం పోసింది. ప్రజా వ్యతిరేకత, గ్రాఫ్ పేరుతో పార్టీని నమ్ముకున్న వారిపై వేటు వేస్తుండడంతో ఎక్కువమంది నేతలు పార్టీని వీడుతున్నారు.
నెలరోజుల వ్యవధిలోనే విశాఖ నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, సీతం రాజు సుధాకర్, దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు పార్టీని వీడారు. ఇంకా ఆ బాటలో చాలామంది నాయకులు ఉన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిపై కార్పొరేటర్లు, మత్స్యకార సంఘం నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు మరోసారి టిక్కెట్ ఇస్తే పార్టీని వీడుతామని హెచ్చరిస్తున్నారు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి స్థానంలో ఉరుకూటి రామచంద్రరావును సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఎమ్మెల్యే నాగిరెడ్డి తో పాటు ఆయన కుమారులు దేవాన్ రెడ్డి, వంశి రెడ్డిలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. విశాఖపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ సైతం పార్టీని వీడేందుకు దాదాపు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి రోజురోజుకు అదుపు తప్పుతోందని వైసిపి అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి నియోజకవర్గం లో వైసీపీలో నాలుగు వర్గాలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న దువ్వాడ శ్రీనివాసును ఇన్చార్జిగా నియమించారు. కానీ సొంత ఇంట్లో వచ్చిన విభేదాలతో ఆయనను మార్చారు. తెరపైకి ఆయన భార్య దువ్వాడ వాణిని తీసుకొచ్చారు. ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో ఇక్కడ ఐదు వర్గాలుగా పార్టీ వీడింది. పాతపట్నం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పై నాలుగు మండలాల పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. ఇక్కడ కూడా గ్రూపులు కొనసాగుతున్నాయి. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే పనిచేయమని నాయకులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే కొందరు టిడిపి గూటికి చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధపడుతున్నారు. అటు స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అక్కడ ఆయనకు సైతం అసమతి తప్పడం లేదు. ఒకవేళ ఆయనకే గాని సీట్ ఇస్తే చాలామంది నేతలు టిడిపిలోకి వెళ్ళనున్నారు. ఇచ్చాపురంలో సైతం వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి.
విజయనగరం జిల్లాకు సంబంధించి రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను మార్చారు. ఆయనను ఏకంగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఇన్చార్జిగా నిర్మించారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరఫున జోగులు గెలుపొందారు. కానీ ఆయనను కాదని తలే రాజేష్ అనే డాక్టర్ ను తెరపైకి తెచ్చారు. కానీ ఆయన కలిసేందుకు పార్టీ క్యాడర్ ఒప్పుకోవడం లేదు. శృంగవరపుకోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుబండి శ్రీనివాసరావు అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ రఘురాజు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ని అరకు ఎంపీ స్థానానికి పంపి.. ఆమె స్థానములో విశ్వేశ్వర రాజును ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆశావాహులు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టి పాల్గుణ కు మొండి చేయి చూపారు. అరకు ఎంపీ మాధవికి బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా కొంతమంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికైతే ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం ప్రారంభమైంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.