Malladi Vishnu: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇటీవల వైసిపి అభ్యర్థుల మార్పులో భాగంగా విష్ణుకు మొండి చేయి చూపిన సంగతి తెలిసిందే. పశ్చిమ నియోజకవర్గంలో ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీనిని దారుణ అవమానంగా విష్ణు భావిస్తున్నారు. అందుకే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల ముందు వరకు ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఎన్నికల ముంగిట జగన్ సీటు హామీ ఇవ్వడంతో వైసీపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా పక్కన పడేయడంతో కాంగ్రెస్ లో చేరడమే మేలని ఒక నిర్ణయానికి వచ్చారు.
మల్లాది విష్ణు మార్పుపై వైసీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఎక్కడైనా మార్పులు తధ్యం అనుకుంటే.. అంతకంటే మెరుగైన అభ్యర్థిని బరిలో దించాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వెల్లంపల్లి శ్రీనివాసును ఇన్చార్జిగా నియమించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ తాజా నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరులు రగిలిపోతున్నారు. బుధవారం తన అనుచరులతో విష్ణు సమావేశమయ్యారు. ఓ ముగ్గురు కార్పొరేటర్లు మినహా అంతా హాజరయ్యారు. కాంగ్రెస్ లో చేరడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ టికెట్ తో పాటు నగర అధ్యక్ష పదవిని విష్ణుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. త్వరలో విష్ణు అనుచరులతో కలిసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది.
2009లో విజయవాడ సెంట్రల్ స్థానం టిక్కెట్ ను రాజశేఖర్ రెడ్డి విష్ణుకు కట్టబెట్టారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ గెలిచి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. జగన్ టిక్కెట్ ఇవ్వడంతో 25 ఓట్లతో అతి కష్టం మీద విష్ణు గెలుపొందారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగారు. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకం పెట్టుకున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో జగన్ దెబ్బేశారు. అందుకే ఎలాగైనా వైసీపీని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణును కలిసి సాయం చేయాలని అభ్యర్థించినా ఆయన పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు అంత ఈజీ కాదు. ఆయన రాకను సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. కానీ మల్లాది విష్ణు వ్యతిరేక వర్గీయులుగా ముద్రపడిన ఎమ్మెల్సీ రుహుల్ల, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిలు స్వాగతిస్తున్నారు. అయితే మెజారిటీ వర్గం మాత్రం వ్యతిరేకిస్తుండడం విశేషం. అటు సెంట్రల్ నియోజకవర్గానికి రావడం వెల్లంపల్లికి కూడా ఇష్టం లేదు. అయితే హై కమాండ్ ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎంటర్ అయ్యారు. మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తుండడం, మల్లాది విష్ణు కాంగ్రెస్ లో చేరడంతో ఆ ప్రభావం తన గెలుపు పై పడుతుందని ఆందోళనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి గెలవకూడదని విష్ణు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీలో చేరి తన ప్రతాపం చూపాలని డిసైడ్ అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.