Uttarandhra economic capital: ఉత్తరాంధ్ర ( North Andhra) స్వరూపం మారుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఇంకోవైపు విశాఖకు ఐటి సంస్థలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్టీల్ ప్లాంట్లు, తయారీ పరిశ్రమలు.. ఇలా ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారిపోతోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా భారీ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అడుగులు వేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే సరికొత్త ఆర్థిక కేంద్రంగా అవతరిస్తోంది. భారతదేశ చిత్రపటంలో విశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతోంది. ఇప్పటికే పర్యాటకంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఇప్పుడు ఆర్థిక రాజధానిగా మారుతోంది.
ఈరోజు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన..
ఈరోజు అనకాపల్లి( Anakapalli ) జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కాబోతోంది ఈ స్టీల్ ప్లాంట్. లక్ష మందికి ఉపాధి కల్పించనుంది. ప్లాంటుకు అనుసంధానంగా ఒక పోర్టు నిర్మాణం కూడా జరగనుంది. దాదాపు 11వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఈ పోర్టు రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా మరో 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇది. దాదాపు 5 వేలకు పైగా ఎకరాలలో ఈ ప్లాంట్ నిర్మాణం కానుంది.
Also Read: లక్ష కోట్ల పెట్టుబడి.. లక్షల ఉద్యోగాలు!.. ఏపీకి ఇదో గేమ్ ఛేంజర్
ఐటీ పరంగా అభివృద్ధి..
ఐటీ పరంగా కూడా విశాఖ ( Visakhapatnam) వేగంగా అభివృద్ధి చెందుతోంది. గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ప్రస్తుతం వాటికి సంబంధించి పనులు వేగవంతం అయ్యాయి. సుమారు 15 బిలియన్ డాలర్లు.. అంటే రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. వచ్చే నెలలో శంకుస్థాపన జరగనుంది. గూగుల్ తన పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిల్వను ఇక్కడ పెట్టనుంది. అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ నెట్వర్క్ కూడా విశాఖకు అనుసంధానిస్తోంది. దీనివల్ల విశాఖ నగరం కేవలం సాఫ్ట్వేర్ సెంటర్ గానే కాకుండా.. ప్రపంచ స్థాయి డిజిటల్ గేట్ వేగా మారనుంది. దాదాపు ఒకటి పాయింట్ 88 లక్షల ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం కానుంది.
ఒక్క గూగుల్ డేటా సెంటర్ తో..
ఒక్క గూగుల్ డేటా సెంటర్ ( Google data centre)రాకతో మిగతా దిగ్గజ ఐటీ సంస్థలు భారీగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.1370 కోట్లతో తన క్యాంపస్ ను ఏర్పాటు చేస్తోంది. కాగ్నిజెంట్ రూ.1583 కోట్లతో భారీ ఐటి పార్క్ నిర్మిస్తోంది. ఆదాని గ్రూప్ డేటా సెంటర్లు, అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ వంటివి ఉత్తరాంధ్రకు ఒక మణిహారంగా మారనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల సాధనలో విశాఖ కలికితురాయి కానుంది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి అదనపు హంగులు. ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధానిగా ప్రపంచానికి పరిచయం కానుంది అన్నమాట.