Unstoppable Season 4 : చంద్రబాబు గుంభనంగా కనిపిస్తారు. చాలా కఠినంగా కూడా ఉంటారు. అయితే ఆయనలో సైతం భావోద్వేగాలు బయటపడ్డాయి. అందుకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో వేదికగా మారింది. ముఖ్యంగా విజయవాడ వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. వరద తీవ్రత, బాధితుల స్థితిగతులు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకే బోటు ఎక్కి వరద ప్రాంతాల్లో తిరిగానని.. బోర్డులో వెళ్ళవద్దని భద్రతా సిబ్బంది వారించినా వినలేదని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. అక్కడ పరిస్థితులు చూసి ఎంతో ఆవేదన కలిగిందని.. అందుకే కలెక్టరేట్లోనే పది రోజులు బస చేశానని.. ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని.. ఆ సమయంలో ఓ ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని గుర్తు చేసుకున్నారు. వరద సమయంలో ఒక తండ్రి తన దగ్గరకు వచ్చి మూడు రోజుల నుంచి పిల్లాడు నీళ్లు అడుగుతున్నాడని.. రెండు పార్టీల నీళ్లు ఇప్పించాలని అడిగారని.. ఆ తండ్రిని, బాలుడిని చూసి తన కళ్ళలో నీళ్లు తిరిగాయని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఆ ఒక్క ఘటనతోనే బాధితులకు రెట్టింపు ఉత్సాహంతో సహాయం చేసినట్లు చెప్పుకొచ్చారు.
* వ్యక్తిగత జీవితం పై
మరోవైపు తన వ్యక్తిగత జీవితాలు ఇష్టాలపై కూడా చంద్రబాబు స్వేచ్ఛగా మాట్లాడారు. మీకు వంట వచ్చా అని బాలకృష్ణ అడిగేసరికి.. తనకు పెద్దగా వంట రాదని.. సలహాలు మాత్రం ఇస్తానని చెప్పుకొచ్చారు. పప్పు బ్రహ్మాండంగా చేస్తానని.. కోడిగుడ్డు ఆమ్లెట్ ఈజీగా వేస్తానని చెప్పుకొచ్చారు. తనకు కాఫీ అంటే ఇష్టమని.. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య కాఫీ తాగుతానని చెప్పారు. హైదరాబాదులో ఉంటే మాత్రం భువనేశ్వరితో కలిసి కాఫీ తాగుతానని అన్నారు.
* భువనేశ్వరి, బ్రాహ్మణీలలో ఎవరు బాస్ అంటే.. తనకు భువనేశ్వరి బాస్, లోకేష్ కు బ్రాహ్మణి బాస్ అని చెప్పారు చంద్రబాబు. ఆ ఇద్దరూ కుటుంబానికి బలమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును మనవడు దేవాన్ష్ కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. రాజకీయాల్లో బిజీగా ఉండే తాత.. తీరిక సమయాల్లో ఏం చేశారని దేవాన్ష్ అడిగారు. టైం దొరికితే నీతో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యే వాడినని.. ఇప్పుడు నువ్వు టైం ఇవ్వట్లేదు.. ఎప్పుడూ బుక్స్ తో కుస్తీ పడుతుంటావ్. నాకు కూడా చేస్తున్న పని మార్చుకుంటే రిలాక్సేషన్ వస్తుంది అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దేవాన్ష్ అడిగిన పొడుపు కథకు తెలివిగా సమాధానం కూడా చెప్పారు. మొత్తానికి అయితే ఈ షో ద్వారా చంద్రబాబు తనలో ఉన్న అభిప్రాయాలను ఇట్టే బయట పెట్టడం విశేషం.