Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant ) కేంద్రంగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. అయినా సరే ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి క్లారిటీ రావడం లేదు. ఇంకా కార్మిక వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఈరోజు ప్లాంటును సందర్శించనున్నారు. ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నారు. ప్లాంట్ అప్పులతో పాటు ఆర్థిక పరిస్థితి, ఉత్పత్తిపై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ప్లాంటుకు సొంత గనులు కేటాయించే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు. భారీ ప్యాకేజీ ప్రకటించినా.. దాని వెనుక మతలబు ఉంటుందని అనుమానంతో ఉన్నారు. కనీసం కేంద్రమంత్రి కుమారస్వామి దీనిపై స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నారు. చాలా ఆశలు పెట్టుకున్నారు.
* చాలా రోజులుగా ఇదే వివాదం
విశాఖ స్టీల్( Visakha Steel ) ప్రైవేటీకరణ అంశం చాలా ఏళ్లుగా నలుగుతూ వస్తోంది. నష్టాలు సాకుగా చూపి ప్రైవేటీకరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ పై చాలా సందర్భాల్లో నిస్సందేహంగా ప్రకటనలు చేసింది. అయితే తాజాగా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో ఇక ప్రైవేటీకరణ ఉండదని కూటమి పార్టీలు చెప్పుకొస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనలు, తాజా వైఖరి చూస్తుంటే కార్మిక వర్గాల్లో ఇంకా అనుమానాలు ఉండనే ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ సద్వినియోగంతో పాటు పూర్తిస్థాయి ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రమంత్రి కుమారస్వామి అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
* కొన్ని అంశాల్లో పీఠముడి
భారీ ప్యాకేజీ ఇచ్చినా కొన్ని కీలక అంశాల్లో పీఠముడి కొనసాగుతూనే ఉంది. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం( central government) ప్రకటించిన ప్యాకేజీ ఎలా వినియోగిస్తారని అంశంపై సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆగస్టులో ప్రారంభిస్తామని ప్రకటించిన బ్లాస్ ఫర్నేష్3 కోసం అవసరమైన ముడి పదార్థాలను ఇప్పుడే కొనుగోలు చేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఎందుకు బిజెపి నేతలు సైతం సహకారం అందిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండి యువ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీని బ్యాంకుల రుణాలు, అప్పులు తీర్చేందుకు ఉపయోగిస్తారని తెలుస్తోంది. గతంలో ఇచ్చిన 1650 కోట్లు కూడా ఈ ప్యాకేజీ లో భాగమేనని తెలుస్తోంది. ఫర్నిసులను నడపాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. జీతాలు, బకాయిలు, ఇంక్రిమెంట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ప్లాంట్ కు సొంత గనులు కేటాయించే పరిస్థితి లేదంటూ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సెయిల్ లో విలీనం కుదరదని కూడా క్లారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
* కేంద్రం తర్జనభర్జన
విశాఖ స్టీల్( Visakha Steel) ప్రైవేటీకరణ పై కేంద్రం తర్జనభర్జన పడింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం పార్లమెంట్లో ఉంది. ప్లాంట్ లాభాల్లోకి వస్తే సరి.. లేకుంటే మాత్రం ప్రైవేటీకరణ వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి కుమారస్వామి ప్లాంటును సందర్శిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసక్తి రేపుతోంది.