KCR-YS Jagan : రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని ఏ రూపకంగా అదృష్టం వరిస్తుందో ఊహించలేం. పదేళ్ల పాటు చతికిల పడిపోయిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా..? అంతే మరి రాజకీయాల్లో ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. తెలంగాణకు రేవంత్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి అవుతారని కూడా బహుషా ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ.. అదృష్టవశాత్తూ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అలాగే.. కొన్ని కొన్ని ఉదంతాలు కూడా ఆయా పార్టీలకు కలిసొస్తుంటాయి.
సరిగా ఇప్పుడు బీఆర్ఎస్‌కు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పార్టీకి హైడ్రా ఊపిరిపోసింది. హైడ్రా కాస్త బీఆర్ఎస్‌కు అస్త్రంగా దొరికింది. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు కళ్లముందే నేలమట్టం అవుతుండడంతో బాధితులు రేవంత్ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కూల్చివేతలు ఆపాలని, కూల్చివేతలు వద్దని వేడుకున్నారు. అదేసమయంలో బాధితులంతా కలిసి బీఆర్ఎస్ తలుపుతట్టడం ఆ పార్టీకి మరింత కలిసివచ్చింది. దాంతో అందివచ్చిన అవకాశాన్ని అవసరం మేరకు వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది.
ఇక.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే అక్కడ 40 ఏళ్ల సీనియర్ నాయకుడు చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ కూడా మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన పాలనలో ఎక్కడ కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పాలనను నడిపిస్తున్నారు. జగన్ హయాంలో అనాలోచిత నిర్ణయాలతో పాలన గాడిన తప్పిందని భావించిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు. అందులో భాగంగా గతంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలను, పెట్టుబడులను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రానికి ఇప్పటికైనా రాజధానిని నిర్మించి చూపించాలనే కసితో ఉన్నారు.
ఐదేళ్లుగా నిద్రావస్థలో ఉండిపోయిన వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు నిద్ర లేపుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వారికి స్ట్రాంగ్ వార్నింగులు ఇస్తూ వస్తున్నారు. అలాగే.. అమరావతిని చీకట్లోకి నెట్టి మూడు రాజధానుల అంశాన్ని జగన్ తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు మూడు రాజధానుల ప్రస్తావనే తీసుకురాకుండా అమరావతిని రాజధాని అని.. అమరావతికి మరోసారి జీవం పోసే విధంగా చూస్తున్నారు. ఇక ఇప్పట్లో ఆయన మీద అక్కడ వ్యతిరేకత వచ్చే పరిస్థితులైతే ఏం కనిపించడం లేదు. అయితే.. అక్కడ ఉల్టా చంద్రబాబు చేతికే ఓ ఆయుధం దొరికింది. అదే తిరుమల లడ్డూ వివాదం. ఈ వివాదంలో ఇప్పటికే వైసీపీని ఏ స్థాయిలో దిగజార్చాలో ఆ స్థాయికి చేర్చారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీపై వ్యతిరేకత వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్, జగన్ ఒకేసారి అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఇరు పార్టీలు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి. కానీ.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు వచ్చిన మైలేజీ ఏపీలో వైసీపీకి దొరక్కపోవడం గమనార్హం.