Undavali Vs Ramoji : మార్గదర్శి కేసులో కీలక మలుపు. సుప్రీం కోర్టుకు ఏకంగా 56 వేల పేజీల వివరాలను మార్గదర్శి యాజమాన్యం సమర్పించవలసి వచ్చింది. అసలు కేసే నిలబడదని ఆది నుంచి వాదిస్తున్న రామోజీ అండ్ కో పూర్తిగా డిపాజిటర్ల వివరాలు అందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్నది మార్గదర్శిపై ఉన్న అభియోగం. ఒక వైపు ఏపీ సీబీసీఐడీ విచారణ చేపడుతుండగా.. మరోవైపు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం ప్రారంభించారు. కానీ తరువాత ఎందుకో కేసు ఆశించిన పురోగతి సాధించలేదు.కానీ రామోజీరావు న్యాయపోరాటం ఆపలేదు. ఈ నేపథ్యంలో రామోజీరావుపై మోపబడిన నేరాభియోగాలను కొట్టివేస్తూ 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టు కేసు వేసింది. దీనిని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ సర్కారు సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటీషన్లు వేశారు.
అయితే ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించలేదని మార్గదర్శి యాజమాన్యం చెబుతూ వచ్చింది. డిపాజిటర్ల వివరాలు సమర్పించనవసరం లేదని వాదించింది. అయితే ప్రతివాదులు మాత్రం కేసులో డిపాజిటర్లే కీలకం కనుక… సమర్పించాల్సిందేనని పట్టుబడ్డారు. కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డిపాజిటర్ల వివరాలను 54 వేల పేజీల్లో సమర్పించాల్సి వచ్చింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ మనుసంఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా ఈ కేసు విచారణను సెప్టెంబరు 26కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశించింది. కాగా కొట్టివేసిన కేసు పురోగతి సాధించడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ కొంత సక్సెస్ అయినట్టే. అసలు డిపాజిటర్ల వివరాలు ఇచ్చేందుకు మొగ్గుచూపని మార్గదర్శి యాజమాన్యానికి ఈ విషయంలో చుక్కెదురైనట్టే.