Chandrababu Arrest: రాజకీయాల్లో చిన్న చిన్న తప్పిదాలు శాపంగా మారుతాయి. తప్పుడు నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఆ ఓటమికి బీజం పడింది మాత్రం 2023 సెప్టెంబర్ 9. అప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి అనుకూల వాతావరణం ఉండేది. కానీ ఆరోజు మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసి చేజేతులా కష్టాలను తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబును అరెస్టు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ తప్పిదం. 2024 ఎన్నికలకు సరిగ్గా తొమ్మిది నెలల ముందు జరిగిన ఈ అరెస్టుతో ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఈ సంఘటన టిడిపి శ్రేణులు రోడ్లపైకి వచ్చేలా చేసింది. అదంతా ఒక ఎత్తైతే.. అరెస్ట్ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు ఆవరణలో.. చంద్రబాబు కుర్చీలో కూర్చున్న ఫోటో చాలా మందిని కదిలించింది.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
* నంద్యాలలో ఉండగా..
2023 సెప్టెంబర్ 8న ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ‘ కార్యక్రమంలో 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు చంద్రబాబు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు వెళ్లారు. రాత్రి బస్సులోనే సేద తీరుతున్నారు. 9వ తేదీ వేకువ జామున 6 గంటలకు డిఐజి రఘురామిరెడ్డి సారధ్యంలో ఏపీ సిఐడి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన అక్రమాలపై నమోదైన కేసులు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ నోటీసులు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు అని చంద్రబాబు కొరకు న్యాయవాదులు సిఐడి పోలీసులను నిలదీశారు. ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడ ఉందో చెప్పాలి అంటూ చంద్రబాబు గట్టిగానే నిలదీస్తారు. ఆధారాలు అన్నింటినీ హైకోర్టుకు సమర్పిస్తాం అంటూ డిఐజి రఘురామిరెడ్డి నేతృత్వంలోని ఏసీబీ అధికారులు బలవంతంగా చంద్రబాబును విజయవాడకు తరలించారు.
* ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు..
సరిగ్గా 2024 ఎన్నికలకు 9 నెలలకు ముందు చంద్రబాబు( CM Chandrababu) అరెస్ట్ రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు సీఎంగా, సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు వ్యవహరించారు. అటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చాలామందికి మింగుడు పడలేదు. ప్రతీకార రాజకీయాలు కు చాలా మంది ఇష్టపడలేదు. వాస్తవానికి చంద్రబాబుపై మోపిన కేసుల్లో కనీస ఆధారాలు లేవు. సెప్టెంబర్ 9న ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ కు రిమాండ్ ఖైదీగా పంపించారు. అయితే కోర్టులో వాదనలు జరిగే సమయంలో ఆవరణలోనే కుర్చీలో కూర్చున్న చంద్రబాబు.. ఎదురుగా ఉన్న కిటికీ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలోనే ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నట్లు ముఖంలో భావాలు వ్యక్తపరిచాయి. ఈ ఫోటో మరింత వైరల్ గా మారి సామాన్యులను సైతం కదిలేలా చేసింది. దాదాపు చంద్రబాబును 53 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచడం ద్వారా అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. పవన్ కళ్యాణ్ వచ్చి మూడు పార్టీల మధ్య పొత్తును ప్రకటించాల్సి వచ్చింది. దాని ఫలితమే 2024 అసెంబ్లీ ఎన్నికలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర అపజయానికి కారణం అదేనని చాలాసార్లు విశ్లేషించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు అరెస్టు జరిగి రెండేళ్లు అవుతున్న.. నాటి సంగతులను గుర్తుచేసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం దానిని ఒక గుణపాఠంగా భావించాయి.