Vice Presidential Election YCP: జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ వ్యవహార శైలి మరోసారి చర్చకు దారితీసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించిన విధానం సరి కాదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి అది ప్రమాదకరమని ఎక్కువమంది హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి పోలింగ్ కూడా ప్రారంభం అయింది. ఎన్డీఏ అభ్యర్థి వర్సెస్ ఇండియా కూటమి అభ్యర్థి అన్నట్టు పరిస్థితి ఉంది. హోరాహోరి పోరు కొనసాగుతోంది. అయితే న్యూట్రల్ పార్టీలు తలోరకంగా ప్రకటనలు చేశాయి. బిఆర్ఎస్ తో పాటు బిజెపి లాంటి పార్టీలు ఈ ఎన్నికను బహిష్కరించాయి. తాము ఏ కూటమికి సపోర్ట్ చేయమని తేల్చి చెప్పాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఎన్డీఏ అడిగింది తడువు ఆ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అయితే దీనిపైనే జాతీయస్థాయిలో ప్రధానంగా చర్చ నడుస్తోంది.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
* ప్రత్యర్థి కూటమికి మద్దతు
2024 ఎన్నికల్లో ఎన్డీఏ( National democratic Alliance ) కూటమికి ప్రత్యర్థిగా నిలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏపీలో టిడిపి నేతృత్వంలో జనసేన, బిజెపి కలిసి పోటీ చేశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేశాయి. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ను కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలి. పోనీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్న ఏకైక కారణంతోనే.. ఆ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనీస ఉనికిలో లేదు. కానీ తమకు ప్రత్యర్థిగా ఉన్న టిడిపి, జనసేన ఉన్న కూటమి అభ్యర్థికి మద్దతు తెలపడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇది ముమ్మాటికి తప్పుడు నిర్ణయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు తేల్చి చెబుతున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పిదమని.. దీనికి మూల్యం చెల్లించుకోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు.
* కనీసం మద్యస్థంగా ఉండకుండా..
జాతీయస్థాయిలో ఏ కూటమితో లేని పార్టీలు దక్షిణాదిలో బీజేడి( Biju Janata Dal ), బిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపనున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వ్యవహరించలేదు బీజేడీ, బిఆర్ఎస్. ఆ రెండు పార్టీలు న్యూట్రల్ గా ఉంటామని.. ఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపలేమని తేల్చి చెప్పారు. అయితే ఆయా రాష్ట్రాల్లో పరిణామాల నేపథ్యంలోనే ఆ రెండు పార్టీలు ఆ నిర్ణయానికి వచ్చాయి. కానీ అంతకుమించి ఏపీలో తమకు ప్రత్యర్థిగా ఉన్న కూటమికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడం పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. కనీసం న్యూట్రల్ గా ఉంటూ ఓటింగ్కు గైర్హాజరు అయి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ముమ్మాటికీ రాజకీయ తప్పిదం అవుతుందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.