AP Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. దాదాపు 18 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఈ కుంభకోణం జరిగిందని సీట్ చెబుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ దోపిడీకి తెర లేపారని.. ఈ కేసులో 40 మందికి ప్రమేయం ఉందంటూ కేసులు నమోదు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఓ నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు. మిగతా ఎనిమిది మంది రిమాండ్ కు సంబంధించి ఈరోజుతో గడువు ముగియనుంది. దీంతో ఎనిమిది మంది నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు తీర్పు పై సర్వత్ర ఉత్కంఠ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఓ ముగ్గురు పై నమోదు చేసిన కేసుల్లో పక్కా ఆధారాలు లేవంటూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిగతా ఎనిమిది మందికి సైతం బెయిల్ లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.
* మద్యం పాలసీ మార్చేసి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ హయాంలో ప్రభుత్వం మద్యం పాలసీని మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే మద్యం దుకాణాల నిర్వహణ వరకు ఎటువంటి అవకతవకలు జరగలేదు.. కానీ ఇదే మద్యం పాలసీమాటున డిస్టలరీలు, మందు సరఫరా చేసే కంపెనీలు, సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని దోపిడీకి పాల్పడ్డారు అన్నది వైసిపి పాలకులపై ఉన్న ఆరోపణ. అత్యధికంగా కమీ షన్లు ఇచ్చిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ప్రతి మద్యం కేసు వద్ద కమీషన్ నాటి ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లిందని సిట్ చెబుతోంది. ఈ మొత్తం మద్యం కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని.. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి సైతం ఈ కుంభకోణంలో చోటు ఉందని.. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం పాలు పంచుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చెబుతోంది. అయితే ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. కానీ ఆయనను ఇంతవరకు అరెస్టు చేయలేదు. రెండుసార్లు విచారణకు పిలిచారు. అయితే అది నిందితుడి కోటాలో కాదు. సాక్షుల కోటాలో విజయసాయిరెడ్డిని పిలిచారని.. ఆయన ఇచ్చిన సమాచారంతోనే సిట్ పట్టు బిగించిందన్న టాక్ వినిపిస్తోంది.
* నెలల తరబడి జైలులో..
అయితే రాజ్ కసిరెడ్డి( Raj kasireddy ) ప్రధాన పాత్రధారి కాగా అందరికంటే ముందే ఆయనే అరెస్టయ్యారు. ఆయన అరెస్టు జరిగి దాదాపు మూడు నెలలు అవుతోంది. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ జరిగి 48 రోజులు దాటుతోంది. ఆయన కంటే ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. అయితే కొద్ది రోజుల కిందట ఈ కేసులో అరెస్ట్ అయిన అప్పటి సీఎం ఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ లకు బెయిల్ లభించింది. కోర్టుకు సమర్పించిన చార్జ్ సీట్లలో వారి పాత్ర పై ఆధారాలు చూపకపోవడంతోనే వారికి బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం చెప్పింది. ఇంకోవైపు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అనిల్ రెడ్డి, పిఏ సునీల్ రెడ్డి కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. వారి అరెస్టు సైతం ఉంటుందని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈరోజు ఈ కేసులో ప్రధాన నిందితుల రిమాండ్ గడువు ముగిసింది. అయితే కోర్టు వీరికి బెయిల్ ఇస్తుందా? లేకుంటే రిమాండ్ పొడిగిస్తుందా? అన్నది చూడాలి.