Jagan vs Sharmila: బెంగళూరు యలహంక ప్యాలెస్ జగన్ ది కాదా? అది వైయస్ కుటుంబం ఉమ్మడి ఆస్థా? అందుకే ఆయన అంతలా తపన పడుతున్నారా? దక్కించుకోవాలని భావిస్తున్నారా? ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ప్రస్తుతం కుటుంబ ఆస్తి వివాదాల నేపథ్యంలో ఇదే చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ సీఎం అవ్వకముందు బెంగళూరు నుంచి వ్యాపారాలు చేసేవారు. పారిశ్రామికవేత్తగా కూడా ఎదిగారు. అందుకే ముచ్చటపడి బెంగళూరులో యలహంక ప్యాలెస్ కట్టుకున్నారని అంతా భావించారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇది నిర్మించారని.. 20 ఎకరాల్లో ఉన్న ఈ ప్యాలెస్ జగన్ ది కాదని తాజాగా తేలింది. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాతే దీనిని నిర్మించారని తెలుస్తోంది. ఈ ప్యాలెస్ వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే గత కొన్నేళ్లుగా ఈ ప్యాలెస్ వైపు జగన్ తొంగి చూడలేదు. ఎప్పుడైతే ఏపీలో ఓటమి ఎదురైందో.. నాటి నుంచే జగన్ బెంగళూరు తరచూ వెళ్లి ఈ ప్యాలెస్ లో ఉంటున్నారు. వారంలో నాలుగు రోజులు పాటు అక్కడే బస చేస్తున్నారు. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందని అంతా భావించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో.. అక్కడి పెద్దల ద్వారా కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగింది. అయితే ఆస్తి వివాదంలో భాగంగానే ఆయన తరచూ బెంగుళూరు వెళ్లి ప్యాలెస్ లో గడుపుతున్నారని తెలుస్తోంది.
* రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే
రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే యలహంక ప్యాలెస్ ను కుమార్తె షర్మిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే విషయం షర్మిల చెబుతుండడంతో జగన్ జాగ్రత్త పడినట్లు సమాచారం. ఎక్కడ షర్మిల అక్కడికి వెళ్లి నివాసం ఉంటారని భావించి.. జగన్ తరచూ ఆ ఇంటికి వెళ్లడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ అంటేనే జగన్ కు ఇష్టం. కానీ అక్కడ కూడా షర్మిలకు సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నిర్మించారు. ఎక్కడ షర్మిల యలహంక ప్యాలెస్ ను స్వాధీనం చేసుకుంటారు అన్న అనుమానంతోనే జగన్ ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
* సువిశాల ప్రాంగణంలో
20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించారు యలహంక ప్యాలెస్ ను. ఇటీవల చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఆ ప్యాలెస్ కు వచ్చినట్లు ప్రచారం సాగింది. లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ సిబ్బందిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో అతి ముఖ్యులు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అంతలా భద్రతను అక్కడ కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వారంలో నాలుగు రోజులు పాటు జగన్ అక్కడే గడుపుతున్నారు. దీనిని బట్టి ఆయన ఆ ప్యాలెస్ విషయంలో ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.