https://oktelugu.com/

TV5 – ABN : లెంపలేసుకున్న టీవీ 5.. రంకలేస్తున్న ఏబీఎన్

ఇక్కడే ఒక ట్విస్టు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్యలను టీవీ5 తప్పుపట్టడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ రెండు ఛానెళ్లు ఎల్లో మీడియాకు చెందినవే. అటువంటి ఎందుకీ అంతర్యుద్ధమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీఆర్పీ రేటింగ్ లో ఏబీఎన్ వెనుకబడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 5, 2023 / 09:38 AM IST
    Follow us on

    TV5 – ABN : ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. పచ్చ పార్టీ ప్రయోజనం మాటున ఈ సెక్షన్ ఆఫ్ మీడియా సాగించే వికృత క్రీడ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో సమస్యలన్నవే లేవన్నట్టు రాజకీయ ప్రత్యర్థులను వెంటాడం వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందంటూ ఆరోపించేది వారే. తాము కోరుకుంటున్నట్టు కోర్టు తీర్పులు రానప్పుడు అదే న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేసేది కూడా వారే. ఇక్కడ కూడా ఎల్లో మీడియా వైవిధ్యం చూపిస్తోంది. సదరు సెక్షన్ లో ని ఒక ఛానెల్ తీరును మరో ఛానెల్ ఎండగట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    వైయస్ అవినాష్ రెడ్డి కేసులో ఒక వర్గం మీడియా చేసిన ఓవరాక్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.లక్ష్మణ్ ఎల్లో మీడియాగా పిలవబడే ఏబీఎన్, మహాటీవీ న్యూస్ ఛానెళ్లపై  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. మే 26న రెండు ఛాన‌ల్స్ లో కోర్టుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ వీడియో క్లిప్‌లను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను  ఆదేశించారు.అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డంతో రెచ్చిపోయిన ఎల్లోమీడియా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు.. ఓ టీవీ చర్చల్లో జడ్జికి డబ్బు సంచులు వెళ్లాయని అరోప‌ణ‌లు చేయ‌డంతో వాటిని కోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దీంతో మహా టీవీ యాజమాన్యం క్షమాపణలు కోరింది. కానీ ఏబీఎన్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

    న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాటీవీ ఛానెళ్లు ఎక్కువగా హైలెట్ చేశాయి. వ్యతిరేక కథనాలు వండి వార్చాయి. వైసీపీ సర్కారు శృతిమించుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో ఏకంగా కోర్టు తప్పుపట్టేసరికి తట్టుకోలేకపోతున్నాయి. దీనికి దిద్దుబాటు చర్యలకు దిగాల్సింది పోయి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కౌంటర్ కథనాలు ప్రచురిస్తోంది. తెలివితేటలు, అభినయాన్ని ప్రదర్శిస్తోంది.

    ఇక్కడే ఒక ట్విస్టు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్యలను టీవీ5 తప్పుపట్టడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ రెండు ఛానెళ్లు ఎల్లో మీడియాకు చెందినవే. అటువంటి ఎందుకీ అంతర్యుద్ధమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీఆర్పీ రేటింగ్ లో ఏబీఎన్ వెనుకబడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టీఆర్పీలో ఎన్టీవీ అగ్రస్థానంలో ఉండగా.. తరువాత స్థానంలో టీవీ9 ఉంది. ఏబీఎన్ ఐదో స్థానానికి పడిపోయింది. దీంతో ఎల్లో మీడియా ఛానెళ్ల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఒకరిని ఒకరు తప్పుకుంటూ కథనాలు ప్రసారం చేస్తుండడంతో తెలుగు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.