Dowry harassment case: నేటి కాలంలో ఆడ,మగ సమానంగా పనిచేస్తున్నారు.. సమాన స్థాయిలో వేతనాలు సంపాదిస్తున్నారు. అన్ని రంగాలలోనూ ఆడవాళ్లు పురుషులకంటే ఎక్కువగా పని చేస్తున్నారు. క్లిష్టమైన రంగాలలో కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. సమాజం ఈ స్థాయిలో పురోగతి సాధించినప్పటికీ.. పెళ్లి విషయంలో ఇప్పటికి అమ్మాయిలు వరకట్నాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది. ఎంత గొప్ప చదువు చదివినప్పటికీ.. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఈ దురాచారం మారడం లేదు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ యువ వైద్యురాలి ఉదంతం సమాజంలో ఉన్న వరకట్నం దురాచారం ఎంతటి ప్రమాదకరమైందో నిరూపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ప్రాంతానికి చెందిన ఓ యువతీ (30) గైనకాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో 2024 నవంబర్లో ఆమెకు వివాహం జరిగింది. అతడు కార్డియాలజీలో పీజీ చదువుతున్నాడు. వివాహం కుదిరిన సమయంలోనే ఆ యువతి కి కుటుంబ సభ్యులు కట్నం కింద 1.5 కోట్ల నగదు ఇచ్చారు. 200 తులాల బంగారం పెట్టారు. 10 కిలోల వెండి ఇచ్చారు. 30 లక్షల విలువైన గృహోపకరణాలు.. 50 లక్షల ఆడపడుచు లాంఛనాలు ఇచ్చారు.
మొదట్లో వారిద్దరి సంసారం బాగానే జరిగింది. అయితే ఇప్పుడు ఆ యువకుడు కర్ణాటకలో ఒక ఆసుపత్రి నిర్మించాలని అనుకుంటున్నాడు. ఆ ఆస్పత్రి నిర్మాణానికి దాదాపు 12.5 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. అయితే ఆ డబ్బును అదనపు కట్నం కింద తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడపడుచు నిత్యం వేధిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆ వైద్యురాలు గర్భం దాల్చింది . ఇటీవల పుదుచ్చేరి ప్రాంతంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న భార్యను, చంటి పాపను చూసేందుకు వచ్చిన ఆమె భర్త.. వెంటనే వెళ్లి పోయాడు.
ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయిన ఆ వైద్యురాలు.. ఆ తర్వాత గొల్లపూడి ప్రాంతంలోని తన స్వగృహానికి చేరుకుంది. ఆసుపత్రిలోనే తనకు విడాకులు ఇవ్వాలని భర్త బెదిరించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు భర్త, అత్తమామలు, ఆడపడుచు మీద ఆదివారం రాత్రి గొల్లపూడి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ వైద్యురాలు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. “ఆమె తన భర్తతో కాపురం చేయాలంటే 12.5 కోట్లు కావాలట. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా” నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.