Turakapalem Mystery: గుంటూరు జిల్లా( Guntur district ) తురకపాలెం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ వరుస మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అయితే దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఓ ఆర్ ఎం పి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సదరు ఆర్ఎంపి నిర్వహిస్తున్న క్లినిక్ ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వివిధ రుగ్మతలతో ఆసుపత్రుల్లో చేరేవారు చనిపోతున్నారు. ఇలా వెళ్తున్న వారు మృతదేహాలు గానే తిరిగి వస్తున్నారు. ఇది ఒక మిస్టరీగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
ల్యాబ్ కు తరలింపు..
గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరం నిర్వహించింది. డాక్టర్లు, సిబ్బందితో కూడిన బృందం ఇంటింటా వైద్య పరీక్షలు చేపట్టింది. రక్త నమూనాలు సేకరించారు. ల్యాబ్ లకు తరలించారు. అయితే దీనంతటికీ కారణం ఒక ఆర్ఎంపి అని వైద్య ఆరోగ్యశాఖ ఒక నిర్ధారణకు వచ్చింది. కలుషితమైన సెలైన్లు, ఐ డోస్ మందులు వాడడం వల్లే గ్రామస్తులు వ్యాధుల బారిన పడ్డారని అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం. ఆర్ఎంపి క్లినిక్ ను సీజ్ చేసి.. సంబంధిత వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. కలుషిత నీరు, మద్యం తాగడం వల్లే వ్యాధులు సంభవించాయని ఇప్పటివరకు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆర్ఎంపి వైద్యం కోణంలో దర్యాప్తు చేస్తుండడంతో ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర బృందం పరిశీలన..
తురకపాలెం ఘటనకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సైతం స్పందించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ దర్యాప్తు బృందం నీటిని, మట్టిని, గాలి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపింది. కేవలం రెండు నెలల్లోనే 30 మంది మరణించడం ఆందోళనకు కారణం అవుతోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పల్లెనిద్ర చేశారు. ఎందుకంటే గ్రామంలో చేతబడి కారణంగానే మనుషులు చనిపోతున్నారన్న అనుమానాలు గ్రామస్తుల్లో ఉన్నాయి. వాటిని పారదోలేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లెనిద్ర చేశారు. ఇంకోవైపు గత కొద్దిరోజులుగా గ్రామస్తులకు ఆహారంతో పాటు మంచినీటిని అందిస్తోంది ప్రభుత్వం. అప్పటినుంచి మరణాలు సైతం అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
గ్రామంలో క్షుణ్ణంగా విచారణ..
అయితే ఈ మొత్తం ఘటనకు గ్రామంలో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ కారణమని వైద్య ఆరోగ్య శాఖ విచారణలో తేలినట్లు సమాచారం. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గ్రామంలో మరణించిన వారంతా జ్వరాలతో బాధపడుతూ ఈ ఆర్ఎంపి వద్ద వైద్య సేవలు పొందినట్లు గుర్తించారు. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు మోతాదుకు మించి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడినట్లు విచారణలో తేలింది. ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తరువాతే బాధితుల ఆరోగ్యం మరింత విషమించిందని.. ఆ తరువాతే వారిని ఆసుపత్రులకు తరలించారని కుటుంబ సభ్యులు దర్యాప్తు బృందాలకు వివరించాయి. మొత్తానికైతే తురకపాలెం మిస్టరీ వీడినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించే వరకు ఇది తేలే అవకాశం కనిపించడం లేదు.