Turakapalem Health Crisis: అనారోగ్యంతో ఆసుపత్రికి వెళుతున్న ఆ గ్రామస్తులు తిరిగి రావడం లేదు. చికిత్స పొందుతూ మృత్యువాత పడుతున్నారు. గడిచిన నాలుగు నెలల వ్యవధిలోనే 40 మంది గ్రామస్తులు చనిపోయారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జ్వరం, దగ్గు, ఆయాసం వంటివి వస్తే వణికి పోతున్నారు. అయితే ఇలా రోగాలతో ఆసుపత్రుల్లో చేరిన వారు మృతదేహాలుగా ఇంటికొస్తున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోతున్నారు. ఇంతకీ ఎక్కడ అంటే? గుంటూరు జిల్లా తురకపాలెం లో ఈ మరణం మృదంగం మోగుతోంది. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు తురకపాలెం హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇంటింటా వైద్య సర్వే..
గుంటూరు జిల్లాలో( Guntur district) ఉన్న తురకపాలెం గ్రామంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు స్పందించారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇంటింటా సర్వే నిర్వహిస్తోంది. ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య లోపం, క్వారీ కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం కావడం తదితర కారణాలతోనే అనారోగ్యానికి దారితీస్తున్నట్లు వైద్య బృందం గుర్తించింది. మృతుల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. మెలియాయిడోసిన్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు ప్రాథమికంగా ఒక ధ్రువీకరణకు వచ్చారు. అయితే వైద్య పరీక్షలు పోయే విషయాలు బయటపడ్డాయి. 80 శాతం మంది పురుషుల్లో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొందరిలో అయితే కిడ్నీల పనితీరు మందగించినట్లు కూడా గుర్తించారు. మరికొందరికి చిన్న గాయాలు ఇన్ఫెక్షన్ గా.. పెద్ద పుండుగా మారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆ ఊరిలో మరణాలపై లోతైన విచారణ కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది.
మూఢ నమ్మకాలతో..
మరోవైపు గ్రామంలో మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. తురకపాలెం గ్రామానికి సంబంధించి రక్షగా నాలుగు వైపులా రాళ్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ రాళ్లు మూడు వైపులా సక్రమంగా ఉన్నాయి. కానీ ఎస్సీ వీధి వైపు రాయి వంగి ఉండడంతోనే మరణాలు సంభవిస్తున్నాయన్న ప్రచారం నడుస్తోంది. ఊరిలోకి దుష్టశక్తులు ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఆ రాయిని సరిచేస్తే కానీ.. ఈ మరణాలు ఆగవని అభిప్రాయపడుతున్నారు. అయితే నాలుగు నెలల వ్యవధిలో 40 మంది మృత్యువాత పడడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ చర్యలతో వీటికి అడ్డుకట్ట పడుతుందో? లేదో? చూడాలి.