TTD Trust Board : టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కొండపై గోవింద నామ స్మరణ మాత్రమే వినిపించాలని స్ట్రాంగ్ గా నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో కొండపై రాజకీయ ప్రసంగాలు కానీ.. మీడియాతో రాజకీయ అంశాలు మాట్లాడడం కానీ చేయడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయం నేటితో అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల కొండపై దర్శనానికి వస్తున్న రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో కొండ పవిత్రత దెబ్బతింటోంది. దీనిపై అనేక రకాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన టిటిడి కొత్త పాలకమండలి తొలి భేటీలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుమల కొండపై రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. పక్కాగా అమలు చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనే ఈ నిబంధన ఉండేది. కానీ అమలుకు నోచుకోలేదు. ఈసారి మాత్రం పక్కాగా అమలు చేయాల్సిందేనని టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించడం విశేషం.
* పవిత్రతను కాపాడేందుకు..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు కలియుగ దైవంగా అభివర్ణిస్తారు. అటువంటి తిరుమల ఆలయ పవిత్రతను, అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు రాజకీయ ప్రసంగాలు చేయొద్దని ఎప్పటి నుంచో భక్తులు కోరుతూ వచ్చారు. అయితే ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మగా ఉండే టీటీడీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోలేక పోయింది. దీనిపై భక్తుల నుంచి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే భక్తుల ఆకాంక్ష మేరకు ఇకనుంచి రాజకీయాలు మాట్లాడవద్దని టీటీడీ నిర్ణయం తీసుకోవడం విశేషం.
* అప్పట్లో విమర్శలు
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ వైసిపి నేతల చేతిలో కీలుబొమ్మగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే టీటీడీని ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కొత్తపోర్టు ఏర్పాటు కాగానే కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేశారు. ఇటీవల తిరుమల కొండపై కొందరు రాజకీయ నేతలు, వారి అనుచరులు హల్ చల్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నవారు ఉన్నారు. అందుకే కఠిన ఆంక్షలు దిశగా టీటీడీ ట్రస్ట్ బోర్డ్ అడుగులు వేస్తోంది. అయితే ఇది ఎంతవరకు అమలు చేస్తారా? రాజకీయ ప్రసంగాలు చేసే వారి విషయంలో టిటిడి ఎలా వ్యవహరిస్తుంది? అన్నదానిపై ఈ అంశం ఆధారపడి ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి.