https://oktelugu.com/

TTD Trust Board : టీటీడీలో సైతం జగన్ రాజ గురువుకు షాక్!

ఏపీ మాజీ సీఎం జగన్ కు రాజ గురువుగా వ్యవహరించారు స్వామి స్వరూపానంద. ఆయన సలహా లేనిదే చీమ నడిచేది కాదు. తిరుమల వచ్చారంటే క్యాబినెట్ మంత్రి వచ్చిన సందడి ఉండేది. చుట్టూ మందిమార్బలం కనిపించేది. అయితే వాటన్నింటినీ రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Written By: Dharma, Updated On : November 19, 2024 3:51 pm
TTD Trust Board

TTD Trust Board

Follow us on

TTD Trust Board :  గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖ శారదా పీఠం ఒక అధికార కేంద్రంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ కు మాదిరిగా.. విశాఖలో శారదా పీఠానికి నేతలు క్యూ కట్టేవారు. 2019కి ముందు అన్ని పార్టీల నేతలు స్వామీజీ వద్దకు వచ్చేవారు. కానీ జగన్ గెలిచిన తర్వాత మాత్రం స్వామి స్వరూపానంద ఇష్టుడైన స్వామీజీగా మారిపోయారు. అందుకే ఏడాదిలో ఒకటి రెండు సార్లు సీఎం హోదాలో జగన్ విశాఖ వచ్చేవారు. శారదా పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు తీసుకునేవారు.తొలుత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారు స్వామి స్వరూపనంద. ఆయన పూజలతోనే తాను సీఎం అయ్యానని చెప్పడంతో జగన్ సైతం ప్రార్థించడం మొదలుపెట్టారు. జగన్ కోసం స్వామీజీ యజ్ఞాలు, యాగాలు చేసేవారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు భారీ యాగం చేశారు. ఆ యాగఫలంతోనే జగన్ సీఎం అయ్యారని ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటినుంచి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద.. అప్పటి ఏపీ సీఎం జగన్ కు రాజ గురువుగా మారిపోయారు. మరో అధికార కేంద్రం అయ్యారు. దేవదాయ శాఖ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు చేయాలన్నా.. స్వామీజీ సలహా లేనిదే అయ్యేది కాదు. అటువంటి స్వామీజీ ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

* ఎనలేని ప్రాధాన్యం
తనకోసం యజ్ఞాలు యాగాలు చేసిన స్వామి స్వరూపానంద కు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన విన్నపాలను ఇట్టే మోక్షం కల్పించేవారు. స్వామీజీ అడిగిందే తడవుగా పనులు చేసి పెట్టేవారు. ఆ చదువుతోనే భీమిలిలో 15 ఎకరాల భూమిని స్వామీజీ వైదిక్ యూనివర్సిటీ గురించి కేటాయించారు. బహిరంగ మార్కెట్లో 225 కోట్ల రూపాయల విలువ ఉన్నాయి భూమిని.. ఎకరాకు లక్ష చొప్పున.. 15 లక్షలకు కేటాయించారు. కానీ ఈ ఎన్నికలకు ముందు స్వామీజీ మరో విన్నపం చేసుకున్నారు. ఆ భూమిని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటానని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి జగన్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. కానీ అప్పటికే ఎన్నికలు రావడం, జగన్ ఓడిపోవడం జరిగిపోయింది. సహజంగానే ఆ భూమిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విచారణ చేసి వెనక్కి లాక్కుంది.

* ఆ స్థలం వెనక్కి
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సైతం ఈ రాజ గురువుకు షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాంలో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకుంది. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. అప్పట్లో స్వామీజీ తిరుమల వస్తే క్యాబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు దానిని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. ఇలా వరుస షాక్ లు తగులుతుండడంతో రాజ గురువు తెలంగాణకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.