TTD: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా భక్తుల సౌకర్యాలకు టీటీడీ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. కీలక మార్పులు సైతం చేస్తోంది. భక్తులు కూడా కొంతవరకు సంతృప్తి చెందుతున్నారు. అయితే భక్తుల వసతుల విషయంలో మరింత సులభతరం చేస్తామని టిటిడి చెప్పుకొస్తోంది. అక్టోబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల అదనపు ఈవో గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి అదే పనుల్లో నిమగ్నమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం పై వస్తున్న వార్తలపై కూడా టీటీడీ స్పష్టతనిచ్చింది.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగస్టులో రెండుసార్లుగరుడ వాహన సేవ జరగనుంది. ఇటీవల వయోవృద్ధుల దర్శనం విషయంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ దర్శనాల నిలిపివేత, లడ్డూ ప్రసాదం పంపిణీ పై ఆంక్షలు ప్రారంభమయ్యాయని ప్రచారం జరిగింది. అయితే అదంతా అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించలేదని తేల్చి చెప్పింది. ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు.. మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే ఆనవాయితీ నడుస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపాయలు విలువ చేసే లడ్డూ ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు కూడా ఇది కొనసాగిస్తామని టీటీడీ ప్రకటన చేసింది.
* ఆ వార్తలను నమ్మొద్దు
సాధారణంగా తిరుమల లో వయోవృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. నంది ఆలయానికి అనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ / పీహెచ్సీ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అయితే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నేపథ్యంలో ఈ దర్శనాలపై ఆంక్షలు విధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకే దీనిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దు అని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
* బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
అక్టోబర్ లో జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏర్పాట్లపై ఆదివారం టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. గరుడ వాహన సేవలో భాగంగా.. అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గరుడ వాహన సేవ ప్రారంభమైన చోటు నుంచి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్ల సమాచారాన్ని కూడా సేకరించారు. ఆగస్టులో రెండుసార్లు గరుడ వాహన సేవ జరగనుంది.
* కొనసాగుతున్న భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఇది క్రమేపి పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో గరుడ వాహన సేవ ఉంటుంది. సెప్టెంబర్ లో సైతం పర్వదినాలు ఉన్నాయి. అక్టోబర్ లో బ్రహ్మోత్సవాలు జరగనుండడంతో ఎక్కువమంది తిరుమల వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.