https://oktelugu.com/

Siddipet: న్యాయం దక్కడం ఆలస్యమైంది.. నిండు జీవితం జైల్లోనే మగ్గి ముగిసిపోయింది.. ఓ అమాయకుడి కన్నీటి గాధ ఇదీ

2013 ఫిబ్రవరి 1న పోచయ్య తల్లి హత్యకు గురైంది. ఆమెను పోచయ్య హత్య చేశాడని పోలీసులు అభియోగాలు మోపారు. అతడిని అరెస్టు చేశారు. 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 5, 2024 / 09:18 AM IST

    Siddipet

    Follow us on

    Siddipet: గొప్ప చట్టాలు, అధునాతనమైన న్యాయస్థానాలు.. అద్భుతమైన రాజ్యాంగం.. సర్వ సత్తాకమైన వ్యవస్థ.. అని చెబుతుంటాంగాని.. మనదేశంలో నేటికీ సత్వర న్యాయం అందడం లేదు. పెండింగ్ కేసులలో సకాలం లో న్యాయం లభించడం లేదు. కోర్టులలో కొండంత స్థాయిలో పెండింగ్ కేసులు ఉంటున్నాయి. ప్రతి ఏడాది వీటి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. క్రిమినల్ కేసులలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బెయిల్ పిటిషన్లు, కేసుల అప్పిళ్లపై జరిగే విచారణ లో తీవ్రమైన జాప్యం ఏర్పడుతోంది. అందువల్ల బాధితులకు సత్వర న్యాయం అనేది ఎండమావి అవుతోంది. ఫలితంగా న్యాయం దక్కేలోపు చాలామంది ఖైదీలు జైల్లోనే మగ్గిపోతున్నారు. కొందరైతే అనారోగ్యంతో కన్నుమూస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన పెద్ద గుండెల ఆలియాస్ గుండెల పోచయ్య ఉదంతమే ఇందుకు ఒక ప్రబల ఉదాహరణ. 11 సంవత్సరాల తర్వాత అతనికి న్యాయం దక్కినప్పటికీ.. అది తెలిసేలోపు అతడి ప్రాణం జైల్లోనే పోయింది.

    ఇదీ జరిగింది

    2013 ఫిబ్రవరి 1న పోచయ్య తల్లి హత్యకు గురైంది. ఆమెను పోచయ్య హత్య చేశాడని పోలీసులు అభియోగాలు మోపారు. అతడిని అరెస్టు చేశారు. 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పోచయ్య 2015లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. 2024 జూలై 25న పోచయ్యను నిర్దోషిగా  హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతడిని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత పోచయ్యకు న్యాయం లభించిందని చాలామంది భావించారు. అతడు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఆరు సంవత్సరాల క్రితమే కన్నుమూశాడు. కోర్టులో పోచయ్య తరఫున వాదించిన న్యాయవాదులకు తగినంత సమాచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

    పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన గుండెల పోచయ్య తన తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే ఆరోపణల నేపథ్యంలో 2013లో అరెస్టు అయ్యాడు. వృద్దురాలైన తన తల్లిని పోషించలేక ఆమెను ఒక చెట్టు కొమ్మతో తువ్వాలు(టవల్) తో ఉరివేసి చంపాడనే అభియోగాలు మోపుతూ దుబ్బాక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సిద్దిపేట కోర్టులో అతడిని హాజరు పరిచారు. సాక్షాలను పరిశీలించి 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిద్దిపేట కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా పోచయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు. అదే ఏడాది పోచయ్య తరఫున అతడి చిన్న కుమారుడు దేవయ్య అలియాస్ దావీద్ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశాడు. దానిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జూలైలో ఈ అప్పీల్ పై హైకోర్టు విచారించి పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది. వెంటనే అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అతడు ఆరు సంవత్సరాల క్రితమే చనిపోయాడట. ఈ విషయం అందర్నీ విస్తు పోయేలా చేస్తోంది.

    చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న పోచయ్య 2018 ఆగస్టు 15న అనారోగ్యానికి గురయ్యాడు. పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు . ఆగస్టు 16న కుటుంబ సభ్యులు జైలుకు చేరుకున్నారు. అప్పటికే అతడు చనిపోయాడని జైలు సిబ్బంది ప్రకటించారు. పోచయ్యకు సత్వరం చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చనిపోయాడు అంటూ అతడి చిన్న కుమారుడు దావీదు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    అయితే 10 సంవత్సరాలకు పైబడిన కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో హైకోర్టు ప్రత్యేక విచారణ నిర్వహించింది. ఇందులో భాగంగా పోచయ్య అప్పీల్ పై హైకోర్టు నిర్వహించిన విచారణలో.. అతనికి వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాలేదు. కేవలం వైద్యుడు, దర్యాప్తు అధికారుల సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించడం సరికాదని హైకోర్టు తీర్పు వెలువరించింది.

    వాస్తవానికి ఒక జైల్లో ఖైదీ చనిపోయినప్పుడు ఆ సమాచారాన్ని అధికారులు సెషన్స్ కోర్టుకు తెలియజేస్తారు. ఒకవేళ ఖైదీ ఆపిల్ పెండింగ్లో ఉన్నప్పుడు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు తెలియజేస్తారు. కానీ పోచయ్య విషయంలో ఇది జరగలేదు. కేసు విచారణలో ఉండగానే అప్పీలు దారు కన్నుమూస్తే ఆ విషయాన్ని ప్రత్యేకంగా నమోదు చేసి హైకోర్టు కేసు విచారణను మూసివేస్తుంది. పోచయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు అప్పీల్ గురించి పట్టించుకోలేదు. వారు నియమించుకున్న న్యాయవాది కూడా కన్నుమూయడంతో పోచయ్య మృతిపై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో వారు తమ వద్ద ఉన్న ఆధారాలతోనే హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పు ప్రకటించింది. వాస్తవానికి మృతిచెందిన ఖైదీల కేసుల వివరాల జైలు అధికారుల వద్ద కూడా ఉంటాయి. ఆ సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

    కాగా, పోచయ్య ఓపెన్ జైల్లో పనులు చేసి 20వేల దాకా సంపాదించాడు. జైలు అధికారులు ఆ డబ్బును అతడి పేరుతో పోచయ్య కుటుంబ సభ్యులకు మనియార్డర్ చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో వచ్చిన సొమ్మును ఇవ్వలేమని పోస్ట్ ఆఫీస్ అధికారులు తిరిగి చర్లపల్లి జైలు అధికారులకు పంపించారు. ఇక ప్రస్తుతం పోచయ్య పెద్ద కుమారుడు జయరాజు గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. దావీదు తన భార్య, తల్లితో కలిసి హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు.