TTD: టీడీపీ వచ్చింది.. తిరుమల భక్తుల కడుపు నిండింది

తిరుపతిలో అన్న ప్రసాదం నాణ్యత పై గతంలో చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఇది ఎప్పటికప్పుడు వెలుగు చూసాయి కూడా. ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత పై భక్తులే నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Written By: Dharma, Updated On : June 21, 2024 5:39 pm

TTD

Follow us on

TTD: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందించేందుకు టిటిడి పటిష్ట చర్యలు చేపట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందించేందుకు ఈవో శ్యామలరావు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. టీటీడీ ఇంచార్జ్ ఈవో గా ఉన్న ధర్మారెడ్డి పై చంద్రబాబు సర్కార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో శ్యామలరావును నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత భక్తుల అన్న ప్రసాదం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీటీడీ అన్న ప్రసాద విభాగం కార్యకలాపాలను సమీక్షించారు. భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందించాలని అధికారులతో పాటు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతిలో అన్న ప్రసాదం నాణ్యత పై గతంలో చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఇది ఎప్పటికప్పుడు వెలుగు చూసాయి కూడా. ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత పై భక్తులే నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్న ప్రసాదం నాణ్యత పై ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టిటిడి డైలీ ఈవో, సోషల్ మీడియా వేదికగా కొందరు ఇదే విషయమై తరచూ ప్రస్తావించేవారు. కళ్లకు అద్దుకుని శ్రీవారే అందించినది గా భావించే అన్న ప్రసాదం అధ్వానంగా మారడంతో టీటీడీ చరిత్ర మసకబారింది. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముందుగా తిరుపతి నుంచి ప్రక్షాళన ప్రారంభించారు. సంవత్సరాలుగా టీటీడీ ఇంచార్జ్ ఈవోగా పాతుకుపోయిన ధర్మారెడ్డిని తప్పించారు. సిన్సియర్ అధికారిగా గుర్తింపు పొందిన శ్యామల రావును నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి అన్నప్రసాద నాణ్యత పై దృష్టి పెట్టారు. దీంతో భక్తులకు నాణ్యతతో కూడిన అన్న ప్రసాదం అందుతోంది.

టిడిపి ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాద నాణ్యతను పెద్దపీట వేసేవి. 1985లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతిలో అన్నప్రసాదశాలలు ఏర్పాటు చేశారు. అవి క్రమేపి విస్తరిస్తూ వచ్చాయి. భక్తుల కడుపు నింపేందుకు ప్రయత్నించేవి. తిరుమల తిరుపతిలో కలిసి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినే వారి సంఖ్య దాదాపు 1.75 లక్షలు కాగా.. తిరుపతిలో 17 వేల మంది ఉన్నారు. ఒక్క రోజున అన్న ప్రసాదం కోసం దాదాపు 38 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. అన్న ప్రసాదం తయారు చేసే వంటశాలలో వసతులు మెరుగుపరిచే పనిలోపడ్డారు ఈవో శ్యామలరావు. అవసరమైతే సిబ్బందిని కూడా పెంచుతామని ఆయన చెబుతున్నారు. మొత్తానికైతే టిడిపి అధికారంలోకి వచ్చింది. తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.