https://oktelugu.com/

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ పద్ధతిలో దర్శన టికెట్లు పునరుద్ధరణ!

పర్యాటకశాఖ తో పాటు రవాణా శాఖకు సంబంధించి టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు శాఖల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లను జారీ చేయనుంది.

Written By: , Updated On : February 14, 2025 / 12:00 PM IST
Tirumala Darshan Ticket

Tirumala Darshan Ticket

Follow us on

Tirumala : తిరుమల( Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. శ్రీవారి దర్శన టికెట్ల జారీ విషయంలో పాత పద్ధతిని పునరుద్ధరించింది. పర్యాటక శాఖ ద్వారా తిరుమల దర్శన టికెట్ల జారీకి నిర్ణయించింది. గతంలో ఈ టికెట్ల జారీలో అవకతవకలు చోటు చేసుకోవడంతో టీటీడీ ఈ విధానాన్ని రద్దు చేసింది. అయితే ఈసారి పటిష్ట చర్యలతో ఈ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇకపై పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. ఈ మేరకు పర్యాటక శాఖ నుంచి వచ్చిన వినతిని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ చేసిన విన్నపానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

* అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం
గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి( TTD trust board) ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఏపీఎస్ఆర్టీసీకి 300 రూపాయల దర్శన టికెట్లను జారీచేసింది. ప్రతిరోజు ఏపీఎస్ ఆర్టీసీకి 1000 టిక్కెట్లు, గోవా పర్యాటక శాఖకు 100, ఇండియన్ రైల్వేకు 250, ఇండియన్ టూరిజం విభాగానికి 100, కర్ణాటక పర్యాటక శాఖకు 500, తెలంగాణ పర్యాటక శాఖకు 350, తెలంగాణ ఆర్టీసీకి 1000, తమిళనాడు పర్యాటక శాఖకు 1000, పాండిచ్చేరి పర్యాటక శాఖకు 100 టిక్కెట్లు జారీ చేసేవారు. మొత్తం ఇలా 5400 టికెట్లను జారీ చేసేది తిరుమల తిరుపతి దేవస్థానం.

* అప్పట్లో అనేక అవకతవకలు
అయితే ఈ టిక్కెట్ల జారీ( tickets issue ) ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయి. పర్యాటక శాఖ తో పాటు ఆర్టీసీ నుంచి టిక్కెట్లు పొందిన ఏజెంట్లు సోషల్ మీడియాలో వాటిని అమ్మకానికి పెట్టేవారు. దర్శన టికెట్లు కావాలని సంప్రదించిన వారికి 300 రూపాయల టిక్కెట్ను 2500 రూపాయల వరకు విక్రయించేవారు. ఈ టిక్కెట్ల రూపంలో భారీగా సొమ్ము చేసుకునేవారు ఏజెంట్లు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రత్యేక బృందాల దర్యాప్తులో భారీగా అక్రమాలు వెలుగు చూసాయి. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు ఈ పర్యాటక శాఖ టికెట్లను రద్దు చేసింది. అయితే ఇప్పుడు పటిష్ట చర్యలతో మరోసారి ఈ టిక్కెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఏపీ టూరిజం చైర్మన్ విజ్ఞప్తి మేరకు ఏపీ పర్యాటక శాఖ ద్వారా స్వామివారి దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.