Tribute to NTR : ఎన్టీఆర్ జయంతి.. ఘాట్ వద్ద బాలక్రిష్ణ, తారక్ నివాళి

మహిళలకు ఆస్తి హక్కు తదితర చరిత్రాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Written By: Dharma, Updated On : May 28, 2023 1:54 pm
Follow us on

Tribute to NTR : ఎన్టీఆర్.. ఈ పేరులోనే ఒక సమ్మోహన శక్తి ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వెండితెరను ఏలిన అగ్ర కథా నాయకుడు ఆయన. రాజకీయ యవనికపై అడుగుపెట్టి సరికొత్త రికార్డులను సృష్టించారు. దేశ రాజకీయాలకు సరికొత్త మార్గం చూపించారు. అచ్చంగా చెప్పాలంటే తెలుగువారిని ప్రపంపం మొత్తానికి పరిచయం చేసిన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అందుకే ఆయన పేరు తెలుగునాట ఆచంద్రార్కం.  కేవలం నటుడు గానే కాదు… రైటర్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయిని అందుకున్న ఎన్టీఆర్..  ప్రజల రుణం తీర్చుకునేందుకు, ప్రజాసేవ చేయడానికి రాజకీయం వైపు అడుగులు వేశారు. టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకురాగలిగారు.  అటువంటి మహోన్నత వ్యక్తి తెలుగు నేలపై పుట్టి నేటికి వందేళ్లవుతోంది. శత జయంతి వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

ఏటా ఎన్టీఆర్ జయంతి సమయంలో మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. శతజయంతి వేడుకల నాటు రాజమండ్రిలో ప్రస్తుతం మహానాడు వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు బాలక్రిష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. టీడీపీ, నాయకులు, అభిమానుల తాకిడితో ఘాట్ రద్దీగా మారింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు వారిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.  ఈ రోజును తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా.. రాజకీయంలోను చెరగని ముద్రవేశారని ప్రశంసించారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ తెదేపా ను స్థాపించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారింది. మహిళలకు ఆస్తి హక్కు తదితర చరిత్రాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా అని బాలకృష్ణ పేర్కొన్నారు.